- ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో మరణించిన తానియా సోని
- ఆమెకు కవిత్వమన్నా, కల్చర్ అన్నా అమితాసక్తి
- ఐఏఎస్ అయ్యి దేశసేవ చేయాలన్న సంకల్పం
న్యూఢిల్లీ, జూలై 29: ఎన్నో ఆశలతో, అకుంటిత సంకల్పంతో, భవిష్యత్తుపై కోటి కలలతో హస్తిన చేరిన చదువుల తల్లి అర్ధాంతరంగా తనువు చాలించింది. శనివారం రాత్రి ఢిల్లీలోని రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి డ్రైనేజీ నీరు నిండిన ఘటనలో మరణించిన తెలంగాణ యువతి తానియా సోనీ చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉండేది. పాఠశాల స్థాయి నుంచే తన చుట్టుపక్కల జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేది. ఆమెకు కవిత్వమంటే అమితాసక్తి అని కుటుంబ సభ్యులు తెలిపారు. తానియా కుటుంబానిది బీహార్. ఆమె తండ్రి విజయ్‌కుమార్ సింగరేణిలో మేనేజర్‌గా పనిచేస్తుండటంతో వారు మంచిర్యాల, శ్రీరాంపూర్‌లో స్థిరపడ్డారు.
చిన్నప్పటి నుంచే కళలతోపాటు చదువులోనూ చురుగ్గా ఉన్న తానియాను ఆమె తల్లిదండ్రులు ఐఏఎస్‌గా చూడాలనుకొన్నారు. అందుకు మొదటి నుంచే ప్రణాళిక వేసుకొన్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపయోగపడుతుందని ఆమె డిగ్రీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ చదివారు. డిగ్రీ పూర్తవగానే సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లారు. కుతురి మరణవార్త తెలియగానే ఢిల్లీ వెళ్లిన ఆయన మృతదేహాన్ని సోమవారం స్వస్థలానికి తరలించారు. ఐఏఎస్ కావాలన్నది తాన్యా చిన్ననాటి కల అని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ‘మా కుటుంబంలో తాన్యానే తెలివైన విద్యార్థి. ఆమెకు కవిత్వమంటే ప్రాణం. నాట్యం చేయటమన్నా మక్కువే. కాలేజీ వేడుకల్లో డ్యాన్స్ చేసేది’ అని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.