calender_icon.png 11 October, 2024 | 11:49 PM

ఫ్యూచర్ సిటీపె ఆశలు!

25-08-2024 12:00:00 AM

  1. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 
  2. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం 
  3. ఫోర్త్‌సిటీలో పెట్టుబడులకు రియల్టర్ల ఆసక్తి  
  4. ముచ్చర్లలో పెరుగుతున్న భూముల ధరలు
  5. ఫోర్త్‌సిటీ ప్రకటనతో రియల్టీకి పెరిగిన భరోసా

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వేదిక ఏదైనా వారి ప్రసంగంలో ఉంటున్న ప్రధాన ప్రకటన ఫ్యూచర్ సిటీ. ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాంతంలో వేల ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కొత్త పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు చెప్తున్నారు.

అయితే ఏడాది కాలంగా రాష్ట్రంలో పెద్దగా రియల్ ఎస్టేట్ గ్రోత్ లేకపోవడంతో పాటు వరుస ఎన్నికలకు తోడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం హైదరాబాద్ రియాల్టీపై పడింది అనేది నర్మగర్భం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రియల్ గ్రోత్‌పై దృష్టి సారించిన ప్రభుత్వం హైదరాబాద్ రియాల్టీని పట్టాలెక్కించే పనిలో భాగంగా ఫ్యూచర్ సిటీ పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. ఫ్యూచర్ సిటీ ప్రకటనతో మళ్లీ రియాల్టీ గ్రోత్‌పై రియల్టర్ల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో ఫ్యూచర్ సిటీ సమీప భవిష్యత్తులో రియల్ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందనే విశ్వాసాన్ని రియల్ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే అన్వేషణ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 2024 జనవరిలో భూములకు ఉన్న ధరలతో పోల్చితే ప్రస్తుతం 20 నుంచి 30శాతం పెరిగాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. 

 పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ..

సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు, విదేశీయు లు సైతం నివాసం ఉండే  ది బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్‌లో ఉండే అహ్లాదకరమైన వాతా వరణం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో దేశంలోని ఇతర కాస్మోపాలిటిన్ సిటీలతో పోటీ పడుతూ హైదరాబాద్ విశ్వన గరంగా ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్‌లో సైబరాబాద్ సిటీ ఆవిష్కృతం అయ్యింది.

తాజాగా ఫ్యూచర్ సిటీగా ఫోర్త్‌సిటీని అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో రియల్ వ్యాపారులతో పాటు ఇన్వెస్టర్ల చూపు ఫ్యూచర్ సిటీపై పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పదింతలు పెరిగింది. గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడంతో హైదరాబాద్ నలుదిక్కులా అభివృద్ధి పరుగులు పెట్టింది.

పల్లెలు పట్టణాలుగా మారాయి. దీంతో రియ ల్ వ్యాపారం ఔటర్ రింగు రోడ్డును దాటి ప్రతిపాధిత రీజనల్ రింగు రోడ్డు వరకు విస్తరించింది. అయితే ముచ్చర్లలో ఫార్మాసిటీ నిర్మాణం కోసం గత ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడంతో ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలకు పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. కానీ తాజాగా ముచ్చర్ల ఫార్మాసిటీకి బదులు ఫోర్త్ సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరుగుతోంది. 

అంతర్జాతీయ ప్రమాణాలతో..

 ఫోర్త్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్య, క్రీడా హబ్‌లకు అధిక ప్రాధాన్య ఉంటుందని చెబుతున్నారు. ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు మెట్రోరైల్ ను ముచ్చర్ల వరకు విస్తరిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. సుమారు 50 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టు కుని ముచ్చర్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందు కు రేవంత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

విశాలమైన రోడ్లు, తాగునీటి సౌకర్యం, అంతర్జాతీయ స్థాయి లో విద్యా, వైద్య సౌకర్యాల ఏర్పాటుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. ముచ్చర్లలో ఏర్పాటు చేసే సిటీ చుట్టూ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్,  రీక్రియేషన్, క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వంటి క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముచ్చర్ల లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది.

ఈ మేరకు ముచ్చర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీ సీఐతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ముచ్చర్లలో మరో నగరాన్ని నిర్మించేందుకు కొంత సమయం పట్టినా.. సామాన్య, మధ్య తరగతి వారికి సొంతిళ్లు నిర్మించుకునేందుకు, కొనుక్కునేందుకు మున్ముందు అవకాశం దక్కుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ప్రకటనతో రియాల్టీకి భరోసా పెరిగిందని  అభిప్రాయపడుతున్నారు. 

భూముల ధరలకు రెక్కలు..

రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం ఫోర్త్‌సిటీ ప్రకటన చేయడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డును దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించగా, ప్రస్తుతం ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాంతంపై రియల్టర్ల ఫోకస్ పెరిగింది. ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజవకవర్గాల్లో భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి.

ముచ్చర్ల సమీపంలోని దాసర్తపల్లి, కడ్తాల్, నేదునూరు, కందుకూరు, మిరాన్‌పేట్, తుమ్మలూరు, మహూశ్వరం, గూడూరు, వంజగూడ, నాగిరెడ్డి గూడ, మక్త మందారం తదితర ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2024 జనవరి వరకు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండల పరిధిలో ఎకరం ధర రూ.1.50కోట్లు ఉండగా, ప్రస్తుతం 1.80 నుంచి రూ.2కోట్ల వరకు పలుకుతుంది. అలాగే కడ్తాల్‌లో కొద్ది రోజుల కిందటి వరకు ఎకరం భూమి ధర రూ.1.20 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.1.50 కోట్లకు చేరింది. ఆమన్‌గల్‌లో ఎకరం భూమి ధర రూ. కోటి ఉండగా, ప్రస్తుతం రూ.1.50కోట్లకు చేరుకుంది.

ముఖ్యంగా శ్రీశైలం హైవేకు ఇరువైపులా ఎకరం భూమి ధర రూ.3కోట్ల వరకు చేరింది. ముచ్చర్ల సమీపంలోని వెంచర్లలో చదరపు గజం ధర రూ.8వేలు ఉండగా, తాజాగా రూ.10 వేల వరకు చేరింది. శ్రీశైలం హైవేకు దగ్గరలో ఉన్న వెంచర్లలో చదరపు గజం ధర రూ.20 వేల వరకు పలుకుంది. అయితే  ఈ ప్రకటనలతో అధిక ధరలకు ప్లాట్లను, స్థలాలను కొనుగోలు చేస్తే అసలుకే మోసం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మాత్రం ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని, లేదంటే బయ్యర్లు నష్టపోయే ప్రమాదం ఉందని రియల్ నిపుణులు సూచిస్తున్నారు.