calender_icon.png 15 October, 2024 | 11:57 PM

రియల్ పాలసీపై ఆశలు

18-08-2024 12:00:00 AM

ఈ నెల 20న నోవాటెల్‌లో క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ - 2024

హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తొలుత నూతన ప్రాజెక్టులకు అనుమతివ్వకపోవడంతోపాటు వరుస ఎన్నికలు, ఏపీలో చంద్రబాబు ప్రభావం తెలంగాణ రియల్టీపై పడింది. దీనికి తోడు నూతన ప్రభుత్వం మొదటి నుంచి రియల్టీపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది.

అయితే తాజాగా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిపై రియల్టర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పాలసీపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తుందని రియల్టర్లలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు క్రెడాయ్ తెలంగాణ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్ సదస్సు వేదిక అవుతుందని రియల్టర్లు భావిస్తున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానుండటంతో రియల్టర్ల ఆశలకు బలం చేకూరుతుంది.

పెట్టబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి క్రెడాయ్ తెలంగాణ స్టేట్‌కాన్-2024 సదస్సులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరిని అందిస్తారని రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ర్టంలోని బడా బిల్డర్లు, రియల్టర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో నిర్మాణ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై లోతైన చర్చ జరుగుతుందని సమాచారం. 

సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి

వ్యూహాత్మక పెట్టుబడులు, మెగా మాస్టర్‌ప్లాన్ - 2050, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతా ల్లో సమానమైన వృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సమగ్ర అభివృద్ధి నమూనాను రూపొందించే లక్ష్యంతో విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఈ సదస్సులో చర్చిస్తారని రియల్టర్లు పేర్కొంటున్నారు. రెరాకు సంబంధించి డెవలపర్ బాధ్యతలు, కొనుగోలుదారు హక్కులు, ఇతరత్రా అంశాలపై నెలకొన్న సందేహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

క్రెడాయ్ దిగ్గజాలు వ్యాపార లాభదాయకతను పెంచడానికి, తెలంగాణ శక్తివంతమైన మార్కెట్‌లో బలమైన స్థాపనకు నిరూపితమైన వ్యూహాలపై, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లపై బిల్డర్లు, రియల్టర్లతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అలాగే నగర శివారులోని శంషాబాద్‌లో ఫోర్త్ సిటీతోపాటు రాష్ట్రం లోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ఇతర ఆశాజనక పట్టణాల వైపు రియల్టీని విస్తరించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడులు, పట్ణణాభివృద్ధి అవకాశాలపై తెలంగాణలో స్కిల్డ్ లేబర్‌పై స్టేట్‌కాన్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.