calender_icon.png 14 March, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ ఉద్యోగాలపై ఆశలు

13-03-2025 02:09:47 AM

నేతల చుట్టూ నిరుద్యోగుల  ప్రదక్షిణలు

నోటిఫికేషన్ జారీలో జాప్యం

కరీంనగర్, మార్చి 12 (విజయక్రాంతి): జిల్లాలో అంగన్వాడి ఉద్యోగాలపై నిరుద్యోగ మహిళలు, యువతులు ఆశలు పెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడి పోస్టులు భర్తీ అవుతాయని ఆశించారు. కానీ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అంగన్వాడి ఖాళీల భర్తీపై ఇటీవల సానుకూలంగా స్పం దించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశ లు చిగురించాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

దాదాపు గత పది సంవత్సరాలుగా అంగన్వాడి పోస్టులు భర్తీ కాకపోవడంతో ఇప్పుడు భర్తీ అయితే మళ్లీ ఏ పది సంవత్సరాలకో భర్తీ అవుతాయోనని, ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,914 మంది వయస్సు దాటిన అంగన్వాడి టీచర్లు ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరు ఉద్యోగ విరమణ చేయనున్నందున ఆ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,135 అంగన్వాడి కేంద్రాల్లో 235 టీచర్ పోస్టులు, 899 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో 69 టీచర్, 2020 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడి నియామకానికి కొత్త మార్గదర్శకా లను తీసుకువచ్చింది. గతంలో కేవలం 10వ తరగతి అర్హతతో నియామకాలు చేపట్టేవారు. ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయడంతోపాటు 35 ఏళ్లలోపు మహిళలు మాత్రమే అర్హులుగా మారారు. అలాగే ఎంపిక ప్రక్రియను రాత పరీక్ష ద్వారా నిర్వహించాలని నిబంధనలు అమలు చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ ముగిసిన తర్వాత కూడా అంగన్వాడి పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి నోటిఫికేషన్ కాని, ప్రకటన కాని ఇవ్వకపోవడంతో నిరుద్యోగ యువతులు, మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.