calender_icon.png 18 March, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రోబో యంత్రాలపైనే ఆశలు!

18-03-2025 12:15:11 AM

  1. ఎస్‌ఎల్పీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు                                   
  2. సాంకేతిక సమస్య కారణంగా అందుబాటులోకి రాని రోబో సేవలు                                 
  3. నిర్విరామంగా కొనసాగుతున్న కడావర్ డాగ్ సెర్చింగ్ ఆపరేషన్         

నాగర్ కర్నూల్, మార్చి 17 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కార్మికుల ఆనవాళ్ళ కోసం రెస్క్యూ టీం బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎంజిఆర్‌ఐ నిపుణుల బృందం జిపిఆర్ రాడార్ ద్వారా గుర్తించిన డి1, డి2 ప్రదేశాల్లోనే కేరళకు చెందిన కడవర్ డాగ్స్ కూడా కార్మికుల అనవాళ్లను గుర్తించడంతో రాట్ హోల్ మైనర్, సింగరేణి, రైల్వే రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి తవ్వకాలు జరిపాయి.

టీబీఎం యంత్రంలో చిక్కుకొని ఉంటారని అనుమానంతో ఇండియన్ రైల్వే ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా కటింగ్ చేసి వాటి శకలాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతున్నప్పటికీ కార్మికుల ఆనవాళ్లు ఇంకా తెలియ రాలేదు.  ఢీ 1 ప్రదేశంలో డేంజర్ జోన్ గా గుర్తిస్తూ పైకప్పు నుంచి మట్టి బురద సిమెంట్ సెగ్మెంట్స్ కూలి పడకుండా సింగరేణి రెస్క్యూ బృందాలు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

ప్రతిరోజు రెండు విడతలుగా కేరళ కడావర్ డాగ్స్ తవ్వకాలు జరిపిన ప్రదేశంలో సెర్చింగ్ ఆపరేషన్ జరిపినా ఎలాంటి ఫలితం అందడం లేదు. సోమవారం కడావర్ డాగ్స్ నిపుణుల బృందం రెస్క్యూ టీం మరోసారి డి-1  ప్రదేశంలోకి వెళ్లాయి.. డేంజర్ జోన్ వద్ద మట్టిని తవ్వితే ప్రమాదం పొంచి ఉందని రోబో యంత్రాలను సిద్ధం చేసినప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో నాలుగు రోజులుగా రోబో యంత్రాలు ముందుకు కదలడం లేదు. ఏఐ టెక్నాలజీతో అన్వి రోబో నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.

దీంతోపాటు కన్వేయర్ బెల్ట్ కూడా మొరాయిస్తుండడంతో రెస్క్యూ బృందాలకు సహాయక చర్యలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోపక్క రోజురోజుకు నీటి ఊట, బురద తీవ్రత పెరుగుతుండడంతో అధికారులు డి వాటరింగ్ ప్రక్రియ  నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. రోబో యంత్రాలు ముందుకు కదిలితేనే ఫలితం దక్కే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క నిత్యం రెస్క్యూ బృందాల నిపుణులతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సమీక్షలు జరుపుతున్నారు.