ఢిల్లీలోని ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తడంతో సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల్లో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యాసోనీ అనే యువతి కూడా ఉంది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద నీరు సెల్లార్‌లోని కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి చొచ్చుకు వచ్చింది. ప్రమాదానికి సంబంధించి పలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా వరద నీరు చేరిందని, అప్పుడు ఓ ఫోర్ వీలర్ వేగంగా దూసుకురావడంతో అలల ధాటికి గేటు విరిగి జలాలు ఒక్కసారిగా సెల్లార్‌లోకి ప్రవహించినట్లు వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటికి పరుగులు తీశారు. కానీ, ఆ ముగ్గురు మాత్రం బైటికి రాలేక నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన అంతా అయిదు నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తున్నది. సివిల్ సర్వీస్‌కు ఎంపికై దేశానికి సేవ చేయాలన్న వారి కలలను నిర్వాహకుల నిర్లక్ష్యం చిదిమేసింది. ప్రమాద సమయంలో సెల్లార్‌లోని లైబ్రరీలో 18 మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల ప్రాణాలు తీసినట్లు స్పష్టమవుతున్నది. ఘటన జరిగిన మూడంతస్థుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగ్ కోసం వినియోగిస్తామని ప్లాన్‌లో చూపించారు. కానీ, దీనికి విరుద్ధంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది.
సెల్లార్ నుంచి రాకపోకల కోసం ఉన్న ఒకే ఒక బయోమెట్రిక్ ద్వారం భారీవరద కారణంగా పని చేయలేదన్న విద్యార్థుల ఆరోపణపైనా దర్యాప్తు జరుపుతామని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్, భవన యజమానిసహా ఏడుగురిని అరెస్టు చేసి, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పాటించనందుకు 13 సెంటర్లకు తాళాలు వేశారు. మరోవైపు ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించారు.
ఈ ఘటన సోమవారం పార్లమెంటు ఉభయసభలను సైతం కుదిపేసింది. రాజ్యసభలో ఈ అంశంపై చర్చ సందర్భంగా కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారాయని చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభలో కూడా ఈ అంశంపై చర్చ జరగ్గా కోచింగ్ సెంటర్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కోచింగ్ సెంటర్ల మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు విద్యామంత్రి ధర్మేంద్రప్రధాన్ నేరుగా సమాధానం చెప్పకుండా ఘటనపై విచారం మాత్రం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణమంటూ అధికార పక్ష సభ్యులు ప్రత్యారోపణ చేశారు. కాగా, తామే కాకుండా నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ ఓ సివిల్స్ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సుదీర్ఘ లేఖ రాశారు.
తామంతా నరకంలో జీవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆ విద్యార్థి విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సీజేఐ ఎలా స్పందిస్తారో చూడాలి. నిజానికి వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు లాభార్జనే లక్ష్యంగా విద్యార్థుల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదనేది చాలా కాలంగా వినిసిస్తున్న ఆరోపణ. ఒక్కో విద్యార్థినుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్లు విద్యార్థులను యంత్రాలుగా ట్రీట్ చేస్తున్నాయని, ఫలితంగా వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నది మేధావుల ఆరోపణ. చదువుకోవడానికి ఆహ్లాదకర వాతావరణం, సంరక్షణ చర్యలూ అవసరమన్న సూత్రాన్ని మరిచి వ్యాపార దృక్పథంతో వ్యవహరించడమే ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం.