calender_icon.png 14 October, 2024 | 11:46 AM

మాజీ భాగస్వామి హీరోను దాటేసిన హోండా

21-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ద్విచక్ర వాహన మార్కెట్లో కీలకమైన మార్పు చోటుచేసుకున్నది. ద్విచక్ర హోల్‌సేల్ విక్రయాల్లో హీరో మోటో కార్ప్ ద్వితీయస్థానంలోకి తగ్గగా, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రధమస్థానాన్ని ఆక్రమించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో హోండా 18.53 లక్షల యూనిట్లు విక్రయించగా, హీరో 18.31 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు జరిపింది.

ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 21,653 యూనిట్లుకాగా, ఎగుమతుల్ని కూడా కలుపుకుంటే వీటి మధ్య అంతరం 1.3 లక్షల యూనిట్లకు పెరుగుతుంది. హీరో మోటో కార్ప్, హోండా మోటార్స్ (జపాన్) 26 ఏండ్ల భాగస్వామ్యం తర్వాత వేరుపడ్డాయి. ఈ రెండు కంపెనీలు భాగస్వామ్యానికి స్వస్తిచెప్పి 13 ఏండ్లు గడిచాయి. ఇప్పటివరకూ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది.