నస్పూర్ (మంచిర్యాల),(విజయక్రాంతి): తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లడం లేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని రెండతస్తుల హాస్టల్ భవనం నుంచి దూకిన సంఘటన బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఆరవ తరగతి చదువుతున్న అలవాల అక్షర (11) ఈ ఏడాదే మంచిర్యాలలోని ఆర్బీహెచ్పి నుంచి ఇక్కడ అడ్మీషన్ పొందింది. హాస్టల్ లో చేరిన నాటి నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడం లేదని, ఆదివారం తండ్రి లక్ష్మణ్ హాస్టల్ కు వచ్చి మంచిగా చదువుకోమని అక్షరను సముదాయించి వెళ్లిపోయాడు. తనను ఇంటికి తీసుకువెళ్లరని మనస్తాపానికి గురైన బాలిక ఉదయం ఆరు గంటల సమయంలో హాస్టల్ బిల్డింగ్ రెండవ అంతస్తు నుంచి దూకింది. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే అక్షరను వైద్యం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు వెన్నుముకలో ఎల్ 4 దెబ్బతిండని, మెరుగైన వైద్యం కోసం వరంగల్ లేదా హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. కేజీబీవీ స్పెఫషలాఫీసర్(ఎసీ) మౌనిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని సంఘటనకు సంబంధించి విద్యార్థి అక్షరను వివరాలు అడిగితెలుసుకొని, వైద్యులను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.