calender_icon.png 11 January, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల అమ్మకాల జోరు

05-07-2024 02:21:55 AM

  • పదేండ్ల గరిష్ఠానికి చేరిన హౌసింగ్ సేల్స్ 
  • ఈ ఏడాది ప్రధమార్థంలో 11 శాతం అప్ 
  • హైదరాబాద్‌లో 21 శాతం వృద్ధి 
  • నైట్ ఫ్రాంక్ రిపోర్ట్

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్, ముఖ్యంగా హౌసింగ్ రియల్టీ జోరు చూపిస్తున్నదని పరిశ్రమ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి ఆరు నెలల కాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల విక్రయాలు 11 శాతం పెరిగి పదేండ్ల గరిష్ఠస్థాయి 1.73 లక్షల యూనిట్లకు చేరినట్టు తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 34.7 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందన్నది. ఈ ఏడాది ప్రధమార్థంలో గృహ విక్రయాలు 11 శాతం వృద్ధితో 1,73,241 యూనిట్లకు చేరగా, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 33 శాతం వృద్ధిచెందినట్టు వివరించింది.

ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టత, సామాజిక, రాజకీయ పరిస్థితుల స్థిరత్వం కారణంగా గత కొద్ది త్రైమాసికాలుగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి బాటలో పయనిస్తున్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బజాజ్ చెప్పారు. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్ విభాగాలు దశాబ్ద గరిష్ఠ పనితీరును ప్రదర్శిస్తున్నాయని గురువారం మీడియాకు చెప్పారు. 2024 ప్రధమార్థంలో అన్నింటికంటే అధికంగా ప్రీమియం హౌసింగ్ అమ్మకాలు 34 శాతం వృద్ధిచెందినట్టు వెల్లడించారు. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్నందున ఇండియాలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగిందన్నారు. తమ అంచనాల ప్రకారం 2024 పూర్తి ఏడాదిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ఆఫీస్ లావాదేవీలు రికార్డు గరిష్ఠానికి చేరతాయన్నారు.