calender_icon.png 29 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేలకు తప్పని ఇంటి పోరు?

29-10-2024 01:35:10 AM

  1. వలస నేతలతో కుదరని సఖ్యత
  2. సహకరించని సొంత పార్టీ శ్రేణులు
  3. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి
  4. స్థానిక ఎన్నికల నాటికైనా తీరు మారేనా? 
  5. కామారెడ్డి జిల్లాలోని శాసన సభ్యుల స్థితి

కామారెడ్డి,అక్టోబర్ 2౮ (విజయక్రాంతి): అధికార పార్టీ, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకూ ఇంటిపోరు తప్పడం లేదు. పాత నాయకులు, కొత్తగా చేరిన నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు. అధికార పార్టీకి చెందిన తమ పరిస్థితే ఇలా ఉంటే ఎవరికి చెప్పుకొని పరిస్థితులను ఎలా చక్క దిద్దుకోవాలో అంతుబట్టడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

పార్టీ అధికారంలో లేనప్పుడు పాత కార్యకర్తలు కష్టకాలంలో పార్టీని ఆదుకున్నారు. కేసులకూ భయపడలేదు. కేసులైన, దాడులైనా అప్పటి అధికార పార్టీ నేతలను ముప్పు తిప్పలు పెట్టించిన నాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారు.

దీంతో అధికారం లేనప్పుడు ఆర్థికంగా నష్టపోయిన తమను అధికారం వచ్చిన తరువాతా అంటిముట్టనట్టు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని పాత క్యాడర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన కొందరికి పదవులు రావడం పాత క్యాడర్ జీర్ణించుకోలేక పోతున్నది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుండటం గమనార్హం. 

‘స్థానికం’ నాటికైనా మారేనా? 

జిల్లాలోని ౪ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో అంటి ముట్టనటెంట ఉంటున్నవారు కొందరైతే.. ఎమ్మెల్యేల ముందు నక్క వినయాలు ప్రదర్శిస్త్తూ బయట ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నియోజకవర్గం ఏదైనా.. పార్టీలు ఏవైనా.. ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు నారాజుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే ప్రభావం కనిపిస్తున్నది. వర్గపోరుతో పనిచేస్తే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

ఎల్లారెడ్డిలో గుర్తింపు లొల్లి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు ఎన్నికల సమయంలో పనిచేసిన పాత క్యాడర్‌కు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే తమను గుర్తించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు బీజేపీకి అనుకూలంగా పనిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు కాకుండా మామూలు కార్యకర్తలకు ఇప్పించడం వెనుక ఎమ్మెల్యే ముందుచూపు ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఏ సమావేశం జరిగినా పార్టీ కోసం, తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకునికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొంటున్నారు. 

కాటిపల్లికి నిలదీతలు!

సీఎం అభ్యర్థులు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ను ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి  పాత క్యాడర్ నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకొంటు న్నారు. ఇటీవల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బహిరంగంగానే కార్యకర్తలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వా దం చోటు చేసుకున్నట్టు తెలిసింది.

ప్రతి పక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో ప్రత్యేక నిధులు తెలేకపోతున్నామని చెప్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ మాత్రం బహిరంగ సభలలో అభివృద్ది నిధులు తెద్దామంటే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడని పేర్కొనడం గమనార్హం.  

బాన్సువాడలో నువ్వానేనా?

బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకతో పాత కాంగ్రెస్ క్యాడర్ మధ్య అగాదం పెరిగింది. నియోజకవర్గ ఇంచార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి పాత క్యాడర్ మద్దతుగా నిలుస్తుంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పాత క్యాడర్ సహకరించడం లేదు.

పోచారం, ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారడంతో అధిష్ఠానం తల పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు బాన్సువాడలో ఇద్దరు నేతలకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారనున్నాయి. అధిష్టానం పెద్దలు ఇద్దరు నేతలను ఒకతాటిపైకి తెచ్చిన పాత క్యాడర్ మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. 

బుజ్జగింపుల పనిలో తోట లక్ష్మీకాంతారావు 

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరిస్థితి మరో రకంగా ఉంది. పాత క్యాడర్ ఎన్నికల్లో తనకు సహకరించలేదని గుర్తించిన ఎమ్మెల్యే.. ఎన్నికలు అయిన తరువాత కొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. వారు నియోజకవర్గంలో సీనియర్ నేతలు కావడంతో వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.

యువత అండగా నిలుస్తున్నా.. సీనియర్ నేతలు మాత్రం ఎమ్మెల్యే నిర్వహిస్తున్న కార్యాక్రమాల్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. తమను లెక్క చేయడం లేదని సీనియర్ నేతలు ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదుల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది.