- నెల రోజులపాటు నియమనిష్టలతో పూజలు
- చెట్టు, పుట్ట, విష సర్పాలు, క్రూర మృగాలే వీరికి దేవుళ్లు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా, జంగుబాయి, ఖాందేవ్ వంటి జాతరలు ప్రత్యేకం
- తొడసం వంశీయుల ఆడపడుచు 2.5 కిలోలనూనె తాగడం ప్రత్యేకత
- భిన్నంగా ఆదివాసీల సంసృ్కతి, సంప్రదాయాలు
ఆదిలాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల ఖిల్లా. సాధారణ ప్రజలకు శ్రావణమాసం ఎంత ప్రత్యేకమైందో.. పుష్యమాసం అంటే అడవి బిడ్డలకు అంతే పవిత్రమైన మాసం. ఈ మాసంలో నియమనిష్టలతో తమ దేవుళ్లను కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పుష్యమాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు నెలరోజులపాటు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక జాతర జరుగుతూనే ఉంటుంది. ఆదివాసీలు నియమనిష్టలతో నెల రోజులపాటు కాళ్లకు చెప్పులు వేసుకో కుండా పవిత్రంగా ఉంటూ తమ ఆరాధ్య దైవాలను, పూర్వీకులను కొలుస్తుంటారు. ఆదివాసీలైన గోండు, కోలాం, పర్ధాన్, తోటి, మన్నే వార్ ఇలా అనేక తెగల ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు.
ఈ మాసంలో ఆదివాసీలు ముఖ్యంగా కేస్లాపూర్‌లోని నాగోబా జాతర, కెరమెరిలోని జంగుబాయి జాతర, నార్నూర్‌లోని ఖాందేవ్ జాతర, సాదల్‌పూర్‌లోని బైరందేవ్ మహాదేవ్, శ్యామ్‌పూర్‌లోని భుడందేవ్, ఇంద్రవెళ్లిలోని ఇంద్ర దేవి, సిర్పూర్‌లోని మహాదేవ్ తదితర జాతరలను పండుగ వాతావరణంలో జరుపుకుంటారు.
ప్రకృతితో ముడిపడిన జాతరలు
ఆదివాసీలు జరుపుకునే ఏ జాతర చూసినా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. చెట్లు, పుట్టలు, నాగు పాములనే ఆదివాసీలు దేవుళ్లుగా భవిస్తూ పూజిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నాగోబా జాతర అంటే నాగదేవత, జంగుబాయి జాతరలో దీపం, ఖాందేవ్ జాతరలో పులి, బైరందేవ్ మహాదేవ్ జాతరలో శివలింగం, ఇంద్ర దేవి జాతరలో ఇంద్ర దేవి, మహాదేవులో శివలింగంను కొలుస్తూ జాతరలు నిర్వహిస్తుంటారు.
గుహలోని జంగుబాయికి పూజలు
తెలంగాణ, మహారాష్ర్ట సరిహద్దులో ఎతైన కొం డలు, దట్టమైన పచ్చని అడవిలో కొలువైన జంగుబాయిని పుష్యమాసంలో ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దేవత అనగానే మనమంతా ఓ ఆకా రం అని ఊహించుకుంటాం.. కానీ ఇక్కడ ఓ గుహలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్నే జంగుబాయి రూపంగా ఊహించుకొని పూజలు చేస్తుం టారు. ఈ జాతరకు తెలంగాణతోపాటు మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివస్తుంటారు.
దేశంలోని అతిపెద్ద జాతరల్లో ఒకటి నాగోబా
నాగోబా జాతర దేశంలోని అతిపెద్ద ఆదివాసీ జాతరల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నాగదేవ తను పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. పుష్యమాసం అమావాస్య రోజు సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య కాలంలో ఆదివాసీ పూ జారులకు ఆరాధ్య దైవం ఆదిశేషు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీరదించి అదృశ్యమవుతాడని ఆదివాసీల నమ్మకం.
ఆదివాసీల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. పుష్యమాసంలో పౌర్ణమి రోజున మేస్రం వంశీయులు గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహిస్తారు. వారం రోజులపాటు అంగరంగ వైభంగా ఈ జాతర సాగుతుంది.
ఖాందేవ్ జాతర తైలం తాగే మహోత్సవం
నార్నూర్ మండల కేంద్రంలో నిరహించే ఖాందేవ్ జాతర అత్యంత ప్రత్యేకం. తొడసం వంశస్థులు ఇక్కడ పూజలు చేస్తారు. మసిమల్ దేవతకు సంప్రదాయ పూజలు నిరహించి, అక్కడి నుంచి ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు.
అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు, పులి దేవతకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం నిర్వహిస్తారు. అప్పటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతరలో తోడసం వంశం అడబిడ్డ నూనె తాగడం ప్రత్యేకత. తొడసం వంశీయుల సమక్షంలో ఓ పాత్రలో పోసిన 2.5 కిలోల నువుల నూనెను ఆడబిడ్డ తాగుతుంది.