calender_icon.png 23 February, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60 కోట్లకు చేరువలో పుణ్యస్నానాలు

23-02-2025 12:00:00 AM

  1. ఈ నెల 26తో ముగియనున్న మహాకుంభమేళా
  2. మహాశివరాత్రికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం
  3. మరో 5 కోట్లకుపైగా వస్తారని అధికారుల అంచనా

లక్నో, ఫిబ్రవరి 22: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి అంకానికి చేరుకుంది. 41 రోజు ల్లో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క శుక్ర వారమే 1.16 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా.. ఇప్పటివరకు 59.31 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

జనవరి 13వ తేదీన మొదలైన మహా కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరో 5 కోట్లకు పైగా జనాలు వస్తారని అధికారులు భావిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కావడం తో ఆరోజున  పుణ్యస్నానాలు ఆచరించే వా రి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముం ది.

45 రోజుల పాటు జరిగే మహాకుంభమేకు 45 కోట్ల మంది భక్తులు మాత్రమే వస్తారని అంచనా వేసిన అధికారుల లెక్కలు పూర్తిగా తప్పాయి. కేవలం 34 రోజుల్లోనే 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక శుక్రవారంతో ఈ సంఖ్య 60 కోట్లకు చేరువ కాగా.. చివరి నాలుగు రోజులు కలిపి 65 కోట్లు దాటే అవకాశముంది. 

రూ.1100లకు ‘డిజిటల్ స్నాన్’

కుంభమేళాకు వెళ్లలేని వారికోసం తాను డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తానంటూ ప్రముఖ యూట్యూబర్ ఆకాశ్ బెనర్జీ  సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశా డు. ఎవరైనా కుంభమేళాలో స్నానం చేయాలని అనుకుంటారో వారు తమ ఫొటోలను వాట్సాప్ చేయాలని తెలిపాడు.

వాట్సాప్ ద్వారా వచ్చిన ఫొటోలను ప్రింట్ తీసుకొని నీళ్లల్లో 11 సార్లు పు ణ్యస్నానం చేయిస్తానని పేర్కొన్నారు. అందుకోసం రూ.1100 వసూ లు చేయనున్నట్లు  స్పష్టం చేశాడు.