13-03-2025 02:42:27 PM
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రజలు హోలీ(Holi festival )పండుగను ఆనందంగా, సురక్షితంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ...శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయరాదని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా ఫేస్బుక్లో గానీ, ఇన్ స్టాగ్రామ్ లో కానీ, మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఈ నెల 14న 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు. సురక్షితమైన రంగులను ఉపయోగించాలని, హానికరమైన రసాయనాలున్న రంగులను వాడవద్దని కోరారు.
ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం నిషేదించినట్లు చెప్పారు. నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడవద్దని, ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేస్తే తీవ్రంగా నేరంగా పరిగణించ బడుతుందన్నారు. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్లకు కాల్ చేయాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చెరువులు, కుంటల్లో లోతైన నీటి లోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని కోరారు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్ల వద్దన్నారు. పండుగ వేళ మహిళలను వేధింపులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.