calender_icon.png 16 March, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హోలీ సంబరాలు

15-03-2025 12:00:00 AM

  • హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎస్పి పరితోషి పంకజ్
  • మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు 

సంగారెడ్డి, మార్చి 14 (విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు తో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, మన్నె కిరణ్ కుమార్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో  ఏర్పాటు చేసిన హోలీ  సంబురాల్లో ఎస్పీ  పరితోష్ పంకజ్ స్వయంగా పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాాంక్షలు తెలిపారు. ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు. బలవంతపు రంగులు పూయడం, మద్యం తాగి, వాహనాలు నడుపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు.

మద్యం సేవించి చెరువులు, కుంటలకు వెళ్లరాదని, జలాశయాల వద్ద లోతట్టు ప్రాంతాలలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు.

హోలీ సంబరాలలో పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ పండుగ జరుపుకున్నారు. సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులు ,అధికారులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

జహీరాబాద్..

జహీరాబాద్‌లో  ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం  కామ దహనాన్ని నిర్వహించిన అనంతరం ఉదయం నుండే పిల్లలు మహిళలు యువకులు కేరింతలు కొడుతూ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు యువకులు కేరింతలు కొడుతూ రంగులు చల్లుకొని కోడిగుడ్లను సైతం తలలపై కొట్టుకున్నారు. కొన్ని గ్రామాలలో ఊట్లను ఏర్పాటు చేసి ప్రధాన కూడలిలో ఊట్లను పగలగొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందోల్‌లో 

ఆందోల్, మార్చి 14 : హోలీ సంబరాలు అంబరానంటాయి. పల్లె పల్లెలో వాడ వాడలో రంగుల ప్రపంచం కనిపించింది. గల్లీ గల్లీలో డీజేల హోరుతో హోలీ జోరు కనిపించింది.  శుక్రవారం ఉదయం నుంచి చిన్న పెద్దలు తారతమ్యం  లేకుండా రంగేళి హోలీ అంటూ ప్రజలు చిందులేశారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లోని వీధుల్లో పర్యటిస్తూ  రంగులు చదువుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

చిన్నారులైతే రంగు సీసాలతో వర్షం కురిపిస్తూ తడిసి ముద్దయ్యారు. మహిళలు సైతం రంగుల ప్రపంచంలోవెళ్లి మురి సిపోయారు.  గ్రామాల్లో  కులమతాలకతీతంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జోగిపేటలో మద్యరంగం వద్ద హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో టెంట్ వేసి మొదటిసారిగా ఈ పండుగకు వన్నె తెచ్చారు. గల్లి గల్లి తిరుగుతూ అందరినీ పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 

మెదక్, మార్చి 14(విజయక్రాంతి): మెదక్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండగను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. యువకులు, పిల్లలు, పెద్దలు అందరు కలిసి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండగలో పాలుపంచుకున్నారు.

కాగా జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేశ్తో పాటు వివిధ శాఖల అధికారులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు.

హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైఖ్యతాభావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటని అన్నారు. ప్రజలు హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, కుంటల్లో  స్నాలాలకు వెళ్ళొద్దని, సరదా మాటున ప్రమాదం పొంచి ఉందని తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా  చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లకుండా తల్లితండ్రులు నియంత్రణ,  పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.

అలాగే ఆర్డీవో క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో రమాదేవి కార్యాలయ సిబ్బందితో కలిసి ఆనందోత్సవాల మధ్య హోలీ పండగ జరుపుకున్నారు. చేగుంట పట్టణ కేంద్రం లో జరుపుకున్న హోలీ సంబరాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, తాజా మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్  చిన్నారులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

మండల కేంద్రంతో పాటు చందాయిపెట్, మక్కారాజ్ పెట్, బోనాల, ఇబ్రహీంపూర్, రాంపూర్, చిన్న శివనూర్,గ్రామాల పరిధిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

పటాన్‌చెరు

పటాన్ చెరు, మార్చి 14 :పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ వేడుకలు ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే యువకులు, చిన్నారులు రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకున్నారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలలోని పట్టణాలు, గ్రామాలలో హోలీ పండుగ ఉత్సాహంగా జరిగింది.

రామచంద్రాపురం పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి హోలీ వేడుకల్లో సతీమణి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి అంజిరెడ్డి డాన్సులు చేశారు.

సిద్దిపేట జిల్లాలో..

హుస్నాబాద్ / సిద్దిపేట అర్బన్ / గజ్వేల్ / కొండపాక / చేర్యాల / జాగదేవపూర్ / దౌల్తాబాద్, మార్చి 14 : సిద్దిపేట జిల్లాలో హోలీ వేడుకలను ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. శీతాకాలపు చివరి రోజుల్లో వచ్చే ఈ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భావిస్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయాన్నే మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యం చేస్తూ వేడుకలను మొదలుపెట్టారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించారు. స్వీట్లు పంచుకున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పట్టణాలతోపాటు కొండపాక, జగదేవపూర్, దౌల్తాబాద్, చేర్యాల మండలాలతో పాటు జిల్లాలోని గ్రామాల్లో యువతీ, యువకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు.

కృత్రిమంగా ఏర్పాటు చేసిన నీటి జల్లుల్లో యువతీ, యువకులు నృత్యాలు చేశారు. ఈ పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు అనేకమంది నగరాలు, పట్టణాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. శీతాకాలపు చివరి రోజులకు వసంతరుతువు ఆగమనానికి గుర్తుగా ఉండే  హోలీని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు స్థానికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.