- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. నాంపల్లి కోర్టు ఆదేశాలు
- ఎస్‌ఐబీ మాజీ చీఫ్ సహా శ్రవణ్‌రావు కు బ్లూ కార్నర్ నోటీసులు జారీ!
- స్వదేశానికి రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ (ఏ1) ప్రభాకర్‌రావుతో పాటు ఓ ఛానల్ అధినేత (ఏ6) శ్రవణ్‌రావును కోర్టులో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది.
అయితే ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరిం చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. సీబీఐ సాయంతో తెలంగాణ సీఐడీ వారికి శనివారం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభాకర్‌రావు పైనా కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులను పోలీసులు భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్‌ట్యాపింగ్
ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. శ్రవణ్‌రావు ఆచూకీని మాత్రం దర్యాప్తు బృందం ఇప్పటికీ తెలుసుకోలేకపోయినట్లు కోర్టుకు తెలిపింది. కాగా, ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావునే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాతనే ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్‌రావు ఆచూ కీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రణీత్ రావు ఏ2గా, తిరుపతన్న ఏ3గా, భుజంగరావు ఏ4గా, రాధాకిషన్ రావు ఏ5గా ఉన్నారు. ఈ నలుగురు ఇటీవల దాఖలు చేసిన మ్యాండెటరీ బెయిల్ పిటిషన్‌ను నాం పల్లి కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు చుట్టూ తిరు గుతోంది. ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విచారణ అనంతరం బీఆర్‌ఎస్ నేతలకు నోటీ సులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికి ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి విషయాలు బయట పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
రాలేకపోతున్నా: ప్రభాకర్ రావు
జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. తన ఆరోగ్య రీత్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ వైద్యులు సూచిం చినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, జూన్ 26న తాను ఇండియాకి రావాల్సి ఉన్నా ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన ప్రస్తావించారు. గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తో పాటు ఇప్పుడు బీపీ కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, మీడియాకు లీకులు ఇస్తున్నారని ప్రభాకర్‌రావుతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.