calender_icon.png 9 October, 2024 | 2:46 AM

ఏడేళ్ల తర్వాత హాకీ ఇండియా లీగ్

05-10-2024 12:00:00 AM

పురుషులతో పాటు మహిళలకు కూడా 

న్యూఢిల్లీ: ప్రస్తుత రోజుల్లో అన్ని రకాల ఆటలకు లీగ్స్ పుట్టుకొస్తున్నాయి. ఏడు సంవత్సరాల క్రితం అటకెక్కిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఈ ఏడాది సరికొత్త అవతారంలో కనువిందు చేయనుంది. ఈసారి పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి మొదలు కానున్న లీగ్‌లో రూర్కెలాలో పురుషుల పోటీలు, రాంచీలో మహిళల పోటీలు జరగనున్నాయి.

అక్టోబర్ 13-15 మధ్య ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 8 పురుషుల జట్లు, 4 మహిళల జట్లు  తలపడనున్నాయి. అక్టోబర్ 13-15 న్యూఢిల్లీ వేదికగా జరగనున్న వేలంలో ఆటగాళ్లను మూడు కేటగిరీలుగా విభజించారు.

రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల కనీస ధరతో ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ప్రతి ప్రాంచైజీలో 24 ఆటగాళ్ల బృందం ఉండనుంది. అందులో కనీసం 16 భారత ప్లేయర్లు (తప్పకుండా నలుగురు జూనియర్ ప్లేయర్లు) ఉండాలనే నిబంధనను విధించారు. 8 మంది అంతర్జాతీయ స్టార్లకు చోటివ్వనున్నారు.