భారత హాకీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన హాకీకి ఒలింపిక్స్‌లో ఉన్న చరిత్ర చిన్నది కాదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు గెలిచిన మన హాకీ జట్టు తర్వాత పతకాలు గెలవడమే మర్చిపోయింది. చాలా రోజుల నుంచి మనకు పతకం లేదనే నిరాశ భారత హాకీ క్రీడాకారులను, అభిమానులను వేధించేది. ఈ వేధనను తీరుస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు పతకం గెల్చుకుంది.
ఇక ఈసారి కూడా మన హాకీ జట్టు పతకం గెలుస్తుందని అంతా ఊహించారు. అందుకు తగ్గట్లే గ్రూపు స్థాయిలో మంచి ప్రదర్శన చేసిన హాకీ టీం క్వార్టర్స్‌కు దూసుకొచ్చింది. అక్కడ కూడా పటిష్ట బ్రిటన్‌ను చిత్తు చేసి సెమీస్ గడప తొక్కింది. కానీ సెమీస్‌లో జర్మనీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన హర్మన్‌ప్రీత్ సేన స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఇక కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ స్పెయిన్‌ను చిత్తు చేసిన మన కుర్రోళ్లు వరుసగా రెండో ఏడాది కూడా పతకం గెలిచి బాకీ తీర్చారు. 5 దశాబ్దాల తర్వాత వరుస పతకాలు సాధించి.. మరోమారు సత్తా చాటారు.