calender_icon.png 8 January, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ

07-01-2025 12:56:56 AM

* ఒకే రోజు ముగ్గురికి సోకిన వైరస్

* బెంగళూరులో ఇద్దరికి, అహ్మదాబాద్‌లో ఒకరికి..

* ఆందోళన అక్కర్లేదన్న కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా

* మాస్కులు ధరించాలని వివిధ రాష్ట్రాల గైడ్‌లైన్స్

* 2001లోనే బయటపడ్డ వైరస్

* స్పందించని డబ్ల్యూహెచ్‌వో

* చెన్నైలో మరో రెండు కేసులు?

న్యూఢిల్లీ, జనవరి 6: చైనాలో కోరలు చాస్తున్న హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమో వైరస్) భారత్‌లో కూడా వెలుగుచూసింది. హే.. చైనాలో ఉంది కదా మనకేం కాదులే అని అనుకున్న వారిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. బెంగళూరులో ఇద్దరు శిశువులు (3 నెలలు, 8 నెలలు), అహ్మదాబాద్‌లో ఒక శిశవు (2 నెలలు)కు ఈ వైరస్ సోకింది. ఈ ముగ్గురు శిశివులు కూడా ఏడాది లోపే ఉండడం గమనార్హం. 

కన్నడ ఆరోగ్య శాఖ అప్రమత్తం

కర్ణాటకలోనే రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌లు వెలుగుచూడటంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని అంచనా వేసింది. ఈ పరిస్థితిపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ‘హెచ్‌ఎంపీవీ వైరస్ గురించి ఆందోళన అవసరం లేదు.

ఇదేం కొత్త వైరస్ కాదు. ఇప్పటికే ఉన్న వైరస్ మాత్రమే. కర్ణాటకలో సోకిన ఇద్దరు చిన్నారులకు చైనా దేశంతో సంబంధం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని తెలిపారు. 

ఐసోలేషన్ తప్పనిసరి: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో హెచ్‌ఎంపీవీ కేసు లు నమోదు కాకున్నా కానీ ఆ రాష్ట్ర ప్రభు త్వం ముందు జాగ్రత్తగా ప్రజలకు అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితిపై కేంద్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశం నిర్వహించిన ఢిల్లీ ఆరోగ్యాధికారులు ఆసుపత్రు లకు పలు ఆదేశాలు జారీ చేశారు.

వైరస్ సోకిందనే అనుమానం ఉన్న వారి విషయం లో ఆసుపత్రులు తప్పనిసరిగా ఐసోలేషన్ నియమాలు పాటించాలని నిబంధనల్లో పేర్కొంది. తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో బాధపడే వారిని మరింత నిశితంగా పరిశీలించాలని, వారి వివరాలను జాగ్రత్తగా మెయింటేన్ చేయాలని సూచించింది. 

మందులు అందుబాటులో ఉంచాలి

పారాసిటమాల్, యాంటీహిస్టమైన్స్, ద గ్గు సిరప్‌లు, బ్రోంకోడిలేటర్స్ వంటి మం దులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలంది. ఆక్సిజన్‌ను కూడా అందుబాటు లో ఉంచుకోవాలని ఆదేశించింది. కరోనా స మయంలో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకోవాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

వారి మీదే ప్రభావం ఎక్కువ.. 

హెచ్‌ఎంపీవీ వైరస్ తక్కువ రోగనిరోధక శక్తి ఉండే చిన్న పిల్లలు, వృద్ధుల మీదే తన ప్రతాపం చూపెట్టనుంది. మన దేశంలో సోకిన మూడు కేసుల్లో కూడా బాధితులు చిన్న పిల్లలే కావడం గమనార్హం. ఈ హెచ్‌ఎంపీవీ వైరస్ అనేక దేశాల్లో వ్యాప్తిలో ఉంది. ఈ వైరస్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో న్యుమోనియాకు కూడా దారి తీస్తుంది. శీతాకాలంలో ఈ వైరస్ ఎక్కువగా తన ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. 

ల్యాబ్‌ల సంఖ్య పెంపు..

హెచ్‌ఎంపీవీ వైరస్ నిర్ధారణ చేసేందుకు కావాల్సిన ప్రయోగశాలల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచింది. హెచ్‌ఎంపీవీ వైరస్ గురించి ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తోంది. మరిన్ని శ్వాసకోస వ్యాధులకు సంబంధించి కూడా గణాంకాలను ఐసీఎంఆర్ పరిశీలిస్తోంది. 

కరోనాలా కాదు.. 

హెచ్‌ఎంపీవీ వైరస్ కరోనాలా వ్యాప్తి చెందదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా కేసులు తేలికపాటివని, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని తెలిపింది. హెచ్‌ఎంపీవీ కోవిడ్ భయంకరమైనది కాదని పలువురు వైద్యులు కూడా ప్రకటించారు.

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ కూడా హెచ్‌ఎంపీవీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది మామూలు జలుబును కలిగించే వైరస్ మాత్రమే అని పేర్కొన్నారు. 

చెన్నైలో మరో రెండు కేసులు?

తమిళనాడులోని చెన్నైలో మరో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసులను ఇంకా ఐసీఎంఆర్ ధృవీకరించలేదు. ఈ రెండు కేసులు చెన్నైలోని రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో వెలుగు చూసినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. ఈ రెండు కేసులు కూడా కన్ఫామ్ అయితే భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 5కు పెరగనుంది. 

హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదు: తెలంగాణ ఆరోగ్య మంత్రి

హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని... నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపారు.

ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ర్ట ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌గా కోఆర్డినేట్ చేసుకుంటున్నట్లు వివరించారు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ర్టంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

జాగ్రత్తలివే.. 

* దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కు, నోటిని కవర్ చేసుకోవడం

* చేతులను సబ్బుతో కడుక్కోవడం

* వాడిన టిష్యూ పేపర్లను మరలా ఉపయోగించకోవడం

* జబ్బుతో ఉన్న వ్యక్తులకు దూరంగా మెలగడం.

* టవల్స్, ఇతర పర్సనల్ వస్తువులు ఇతరులతో పంచుకోకపోవడం

* కళ్లు, ముక్కు, నోటిని తక్కువగా తాకడం.

* జనాలు ఉండే ప్రాంతాల్లో ఉమ్మకుండా ఉండడం.

* రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం.

ట్రెండింగ్‌లోకి లాక్ డౌన్

హెచ్‌ఎంపీవీ కేసులు భారత్‌లో వెలుగు చూడడంతో అంతా లాక్ డౌన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎక్స్‌లో లాక్‌డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆందోళన అక్కర్లేదని ఆరోగ్య మంత్రి ప్రకటించినా కానీ జనాలు మాత్రం వర్రీ అవుతూ పోస్టులు పెడుతున్నారు. మరోమారు లాక్ డౌన్ వస్తే ఎలా అంటూ కంగారుపడుతున్నారు. 

రద్దీగా ఉంటే మాస్కులు మస్ట్: కర్ణాటక

కన్నడ ప్రభుత్వం హెచ్‌ఎంపీవీ వైరస్‌కు ఎవరూ భయపడొద్దని చెబుతూనే ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచించింది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా ఆ సమయంలో నోటిని ముక్కును కవర్ చేసుకోవాలని, తరచూ చేతులను కడుక్కోవాలని సూచించింది.

అలాగే వాడిన టిష్యూలను మరలా ఉపయోగించొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని తెలిపింది. రద్దీ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించింది. 

ఆందోళన అక్కర్లేదు: ఆరోగ్య మంత్రి నడ్డా 

హెచ్‌ఎంపీవీ కేసుల గురించి ఆందోళన అక్కర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ వైరస్ 2001 నుంచే వ్యాప్తిలో ఉందని పేర్కొన్నారు. ‘హెచ్‌ఎంపీవీ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అన్ని వయసుల వారికి ఇది సోకే ప్రమాదం ఉంది. శీతాకాలంలో, వసంత రుతువు ప్రారంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

డబ్ల్యూహెచ్‌వో కూడా ఈ పరిస్థితిని పరిశీలిస్తోంది. త్వరలోని అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుంది. జనవరి 4వ తేదీన డీజీహెచ్‌ఎస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ మీటింగ్ జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు.