calender_icon.png 29 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమ్మయ్య.. వాన తెరిపిచ్చింది!

03-09-2024 12:38:53 AM

ఊపిరి పీల్చుకున్న సంగారెడ్డి జిల్లా ప్రజలు

సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద

నారింజ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సంగారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. సోమవారం ఉదయం వర్షం తెరపివ్వడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సిర్గాపూర్, రాయికోడ్, న్యాల్‌కల్, మొగుడంపల్లి, కోహిర్, ఝరాసంగం, జిన్నారం, కంది, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రాంచంద్రపూర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. గుమ్మడ్‌దల, హత్నూర, సంగారెడ్డి, నిజాంపేట, సదాశిపేట, పుల్కల్, ఆందోల్, వట్‌పల్లి, మునిపల్లి, జహీరాబాద్, మానూ ర్, నాగిలిగిద్ద, నారాయణఖేడ్, కల్హేరా, కంగ్టి మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది.

జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ) లోని నారింజ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తెలంగాణ మార్గాల్లో రాకపోకలు నిలిపోయాయి. ప్రాజెక్టును సంగారెడ్డి శిక్షణ కలెక్టర్ మనోజ్, అదనపు కలెక్టర్ మాధురి పరిశీలించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడం మహిపాల్‌రెడ్డి పర్యటించారు. రామచంద్రాపురంలో పర్యటించి ఇండ్లు కోల్పో యిన బాధితులకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని ప్రకటించారు. వర్షలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ పక్కన వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులు వాహనాలను మళ్లించారు. నక్కవాగులో వరద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో సర్వీస్ రోడ్డుపై వరద ప్రవహించింది. నల్లవాగు ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతున్నది. సంగారెడ్డిలో 65వ జాతీయ రహదారిపైకి వరద రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు జాతీయ రహదారి పై వరద నిలువకుండా జేసీబీలతో మళ్లించారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. 

‘జల నిధులు’ కళకళ..

సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 29.017 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 18.48 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలు, వాగులు జలాలతో కళకళలాడుతున్నాయి.