04-03-2025 01:44:26 AM
యువకుడిని ఢీకొట్టి పారిపోయిన కారు
రాజేంద్రనగర్, మార్చి 3 (విజయక్రాంతి): పొట్టచేత పట్టుకొని బతుకుజరువు కోసం వచ్చిన ఓ యువకుడు కారు ఢీకొనడంతో మృత్యు ఒడికి చేరుకున్న విషాదకర సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన కోవూరి శ్రీనివాస్ (30) తన భార్య పిల్లలతో కలిసి నార్సింగి కి వలస వచ్చాడు.
స్థానిక మౌంట్ లిటర స్కూల్లో పనిచేస్తూ వెస్ట్ సైడ్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10:30 గంటలకు శ్రీనివాస్ నార్సింగ్ లోని వీరభద్ర కిరాణా షాపు నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో వివేకానంద నగర్ కాలనీ సమీపంలో అతడిని గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్తో భార్య శిరీష కు సమాచారం ఇవ్వగా ఆమె ఘటన స్థలానికి చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టి పారిపోయిన నడుచుకుంటూ వెళుతున్న శ్రీనివాస్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొని పారిపోయింది.
అనంతరం సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా టాటా హర్యార్ వాహనం అతడిని ఢీ కొట్టి పారిపోయినట్లు దృశ్యాలు నమోదయ్యాయి. టాటా హారియర్ వాహనం అతడిని ఢీ కొట్టి పారిపోయినట్లు సీసీ కెమెరాలు నమోదు అయింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.