calender_icon.png 25 October, 2024 | 12:03 PM

మన రాచకొండ ఖిల్లా!

29-05-2024 12:05:00 AM

ఎంతో ఘనమైన, వైభవోపేతమైన చరిత్ర రాచకొండ సొంతం. తెలంగాణ చరిత్రలో రాచకొండ పేరు చాలా ముఖ్యమైనదిగా చెప్పకోవాలి. రాచకొండ చాలా మందికి తెలుసు.. కానీ అది ఎక్కడ ఉంటుంది? అక్కడున్న వారసత్వ సంపద ఏంటి? రాచకొండను గతంలో ఎవరు పాలించారు? అనేవి చాలా తక్కువ మందికి తెలుసు. జలపాతాలు, గుట్టలు, ప్రకృతి అందాలకు, చారిత్రక సంపదకు కేరాఫ్  అడ్రసయిన రాచకొండ గురించి తెలుసుకుందాం..

ఎక్కడ ఉంది?

రాజులు ఏలిన రాచకొండ హైదరాబాద్‌కు సరిగ్గా అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవేకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సంపదకు నిలయం అవ్వడం వల్ల టూరిజానికి అనుకూలమని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న జలపాతాలు, గుట్టలు, మనోహరమైన ప్రకృతి అందాలను, చారిత్రక స్థలాలను చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారు.

ప్రాంత చరిత్ర

కాకతీయ సామ్రాజ్యం పతనం తరువాత సామంతులు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆ సంద ర్భంలో నేటి నల్గొండ జిల్లా మహబూబ్ నగ ర్ జిల్లా లో రేచర్ల వెలమ రాజుల రాజ్యం వెలిసింది. కాపా య నాయుని మరణాంతరం తెలంగాణలోని ముసునూరు నాయకులు రాజ్యాన్ని ఆక్రమించి, మొత్తం తెలంగాణకు పరిపాలన అధిపతులు అయ్యారు. సుమారు 150 ఏళ్లు రాచకొండ, దేవరకొండను రాజధానిగా చేసుకొని పాలించారు. అంతేకాకుండా తెలుగుదేశ ఆంధ్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. ఈ ప్రాంతాన్ని పాలించిన వారిని వెలమలు లేదా పద్మనాయకులు అని అంటారు. రేచర్ల వెలమరాజులు మొదట కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. ఈ వంశంలో మొదట అనపోతా నాయుడు, సింహాసనం అధిష్టించి పాలన చేశాడు. తన రాచకొండను అభేద్యంగా చేయడానికి ఒక రాతి కోటను అనపోత సముద్రం అనే జలాశయాన్ని బావులను నిర్మించి పాలన చేశాడు.

పర్యాటక కేంద్రం

రాచకొండ ఒక టూరిస్ట్ స్పాట్‌గా పేరుపొందింది. ఇక్కడ వర్షాకాల సమయంలో జలపాతాలు పొంగిపొర్లుతాయి. చుట్టుకొండలు చల్లని వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడికి ప్రజలు క్యూ కడుతుంటారు. అరకొర వసతుల వల్ల ఎక్కువ సేపు ఉండలేక వెంటనే వెళ్లిపోతుంటారు. ప్రకృతి అందాలకే కాకుండా స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా  ఉంది. గతంలో రామలింగేశ్వర స్వామి శివలింగం బయటపడినట్టు స్థానికులు చెపుతుంటారు. నిత్యం భక్తుల తాకిడితో ఆలయం కళకళలాడుతుంటుంది. నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా పక్కనే చాలా గుళ్లు గోపురాలు, మెట్ల బావులు, శివాలయం, వైష్ణవ ఆలయాలు, మసీదులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనోహరమైన ప్రకృతికే కాకుండా ఆధ్యాత్మికతకు కూడా రాచకొండ నిలయంగా మారింది. ఆదిమ మానవుని కాలం నాటి చిత్రాలు రాచకొండ గుట్టపైన మనకు కనబడతాయి. ప్రకృతి సంపద, చారిత్రక సంపద రాచకొండలో నిక్షిప్తమై ఉంది. ఇంతటి ఘనమైన వారసత్వ సంపద కేరఫ్ అడ్రస్ అయిన రాచకొండను ప్రభుత్వాలు పట్టించుకోకుండా విస్మరిస్తున్నాయని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకోవాలని అధికారులను కోరుతున్నారు.

చరిత్రను భావితరాలకు అందించాలి

గతంలో పాలించిన  రాజులు, చక్రవర్తులు, నిజాంలు గొప్ప గొప్ప కట్టడాలను, ప్రజలకు ఉపయోగపడే భవనాలను నిర్మించారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండి ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే.. ఆనాటి ఇంజనీరింగ్ వ్యవస్థ, వాళ్ల గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ చారిత్రక సంపదను, శిథిలావస్థలోని నిర్మాణాలను మరమ్మత్తులు చేసి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వాలది. ‘ఏ చరిత్ర అయినా వర్తమానం మీద భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. తన ప్రభావాన్ని చూపే చరిత్ర లో భాగమైన కట్టడాలను, నిర్మాణాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలి’. దీనివల్ల గతకాలపు జీవన విధానం భవిష్యత్ తరాలకు తెలుస్తుంది. అయితే రాచకొండను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. చారిత్రక సంపదను పరిరక్షించలేదు. ప్రస్తుత ప్రభుత్వమయినా దీనిని గమనించి ఈ చారిత్రక స్థలాన్ని అద్భుత టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలని కోరుకుందాం.

-  బీ. కిరణ్ ఫిషర్, అడ్వకేట్

సెల్: 9133661793