calender_icon.png 24 October, 2024 | 7:47 AM

చరిత్రను తొక్కిపెట్టారు

18-09-2024 01:17:15 AM

  1. రజాకార్ల అకృత్యాలు, హిందువులపై దాడులను చరిత్ర మర్చిపోదు 
  2. అమరులైన వీరులందరికీ శ్రద్ధాంజలి
  3. తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  4. రజాకార్ల వారసుల కోసం తెలంగాణ విమోచన దినోత్సవం మరిచారు 
  5. కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందనే విషయం ఈ తరంలో చాలా మందికి తెలియదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత గొప్ప పోరాట చరిత్రను నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఇందుకు ఓటుబ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణ కారణమని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి జన్మదినోత్సవాలు, ఒక సంస్థ వార్షికోత్సవాలు జరుపుకుంటామనీ, అలాంటిది ఇంతటి త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన స్వాతంత్య్రం గురించి ఎవరికి తెలియకూడదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో విమోచన దినోత్సవం అధికారి కంగా నిర్వహించాలని నాటి పాలకులను నిలదీసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక స్వరం మార్చారని ఆరోపించారు. మజ్లిస్ భయంతో వెనకడుగు వేశారని అన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.

అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ విమోచన దినోత్సవాలను రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించకున్నా, కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు నిర్వహిస్తోందని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో భాగమై ఇప్పుడు కర్నాటక, మహారాష్ర్టలో కలిసిన జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు జరుపుతుంటే.. ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా నిర్వహించేందుకు నిరాకరించాయని ఆరోపించారు. 

రజాకార్ల అకృత్యాలు

స్వాతంత్య్రానికి ముందు దేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానం నిజాం నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్య నలిగిపోయిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. నాడు తెలుగు భాషపై లెక్కలేనన్ని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారని తెలిపారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఎందరినో దారుణంగా అణచివేశారని తెలిపారు. రజాకార్ల దౌర్జన్యాలకు 1947 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 60వేల కుటుంబాలు బలయ్యాయని.. హిందువులకు చెందిన వందల కోట్ల సొత్తు కొల్లగొట్టిన ఘటనలను చరిత్ర మర్చిపోదన్నారు. ఆనాటి అమరవీరులందరికీ శ్రద్దాంజలి ఘటిస్తున్నామని తెలిపారు.  

ముమ్మాటికీ విమోచన దినోత్సవమే 

నిజాం సైన్యాన్ని ఓడించి భారత సైన్యం విజయం సాధించినరోజు, నిజాం సైన్యంపై యుద్ధట్యాంకులతో, విమానాలతో భారత సైన్యం యుద్ధం చేసి ఈ గడ్డపై మూడు రంగుల జాతీయ జెండా ఎగురవేసిన ఈ రోజు విమోచన దినం, విజయ దినం, స్వాతంత్య్ర దినమే తప్పితే మరొకటి కాదని కిషన్ రెడ్డి స్పష్‌టంచేశారు. 17 సెప్టెంబర్ ను బీఆర్‌ఎస్ జాతీయ సమైక్య దినం అనడం.. కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం అనడం ముమ్మాటికి ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని విమర్శించారు. నిజాం నియంతృత్వం నుంచి హైదరాబాద్ విముక్తి పొందిన రోజు జాతీయ సమైక్యతా దినం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మన ప్రాంతానికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కల్పించి.. ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. 

నాటి అమరుల బలిదానాలకు అవమానమే : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

గత ప్రభుత్వాలన్నీ తెలంగాణ విమోచన చరిత్రను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ పోరాట వాస్తవాల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపిన సినిమా రజాకార్ అని, ఈ సినిమా తీసిన గూడూరు నారాయణరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భావితరాలకు నిజానిజాలు తెలియజేసేందుకే కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాలను తలుచుకుంటే ఇప్పటికి తన రక్తం మరుగుతుందని అన్నారు.

నిజాం చేతిలో తెలంగాణ బందీగా ఉంటే భరతమాత కడుపులో కేన్సర్ గడ్డ ఉన్నట్టేనని గుర్తించిన పటేల్... ఆపరేషన్ పోలో పేరుతో రక్తం చుక్క చిందకుండానే... నిజాం మెడలు వంచి తెలంగాణకు విమోచనం కలిగించిన మహనీయుడన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మొట్టమెదట తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి సీహెచ్ విద్యాసాగర్ రావు ఉద్యమ స్పూర్తిని మరువలేమని పేర్కొన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడమంటే నాటి సమర యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమేనన్నారు.

తాము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదని, ముస్లింలంతా రజాకార్లు కారని చెప్పారు. దేశ విచ్చిన్నకర శక్తుల వారసుల పార్టీతో రాష్ర్టంలోని రాజకీయ పార్టీలు అంటకాగడం సిగ్గుచేటన్నారు. అధికా రంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించిన వాళ్లే.. అధికారంలోకి వచ్చాక మాట మార్చడంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 గ్యారంటీలను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ‘ప్రజా పాలనా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాలా అని ప్రశ్నించారు.

పిడికెడు మంది రజకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించట్లేదని విరుచుకుపడ్డారు. దేశం గెజిట్ ప్రకటించినందున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహిస్తే కేంద్రం భాగస్వామి అయ్యేందుకు సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.