ఆసీస్ గడ్డపై టీమిండియా తన వేటను ఘనంగా ప్రారంభించింది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్న చందంగా పేస్ ఉచ్చుతో మనల్ని దెబ్బకొట్టాలని చూసిన కంగారూలు మన దెబ్బకు తోక ముడిచారు. ఫలితంగా పెర్త్ టెస్టులో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసింది.
295 - విదేశాల్లో టెస్టుల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. గతంలో వెస్టిండీస్‌పై (318 పరుగుల తేడాతో) విజయం తొలి స్థానంలో ఉంది.
- ఆసీస్ 238 ఆలౌట్
- 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
- బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- డిసెంబర్ 2 నుంచి రెండో టెస్టు
పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 534 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌటైంది.
ట్రావిస్ హెడ్ (101 బంతుల్లో 89) ఒంటరి పోరాటం చేయగా.. మిచెల్ మార్ష్ (47) పర్వాలేదనిపించాడు. భార త బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయ గా.. సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. 8 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1 ఆధిక్యంలో నిలిచింది.
రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది. మొదటి టెస్టులో పేస్‌తో మనల్ని బురిడీ కొట్టించాలన్న ఆసీస్ ప్రయోగం వికటించింది. పేసర్లతో భారత్‌ను కట్టడి చేయాలనే వ్యూహం వారినే దెబ్బకొట్టింది. మొదటి రోజు నుంచే పిచ్ పేసర్లకు స్వర్గధామంగా మారింది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి 150కే ఆలౌట్ చేశారు.
కానీ ఈ ఆనందం ఆసీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మన భారత పేసర్లు చెలరేగి ఆసీస్‌ను 104కే కట్టడి చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో మన పని పట్టాలని చూసినప్పటికీ జైస్వల్, కోహ్లీ, రాహుల్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఆసీస్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. మిగతా పనిని బౌలర్లు పూర్తి చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
అప్పుడలా.. ఇప్పుడిలా
పెర్త్ పిచ్ ఆస్ట్రేలియా మీద పగబట్టినట్లు కనిపించింది. మూడో ఇన్నింగ్స్ (భారత రెండో ఇన్నింగ్స్)లో ఆసీస్ బౌలర్లకు పెర్త్ పిచ్ ఏ మాత్రం సహకరించలేదు. కానీ నాలుగో ఇన్నింగ్స్‌లో మాత్రం మన భారత బౌలర్ల ఈ పిచ్ మీద రెచ్చిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.
2021లో గబ్బాలో పంత్ విశ్వరూపం చూపించగా.. ఇప్పుడు పెర్త్‌లో యశస్వి తన బ్యాటింగ్‌తో ఆసీస్‌ను చావు దెబ్బ కొట్టాడు. ఆసీస్ సీమ్ మంత్రం అంతగా ఫలించినట్లు లేదు. భారత లైనప్‌లో కూడా సీమర్లు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయిన కంగారు మేనేజ్‌మె ంట్ సీమ్ ట్రాక్‌తో బొక్కబోర్లాపడింది. సుందర్ తీసిన రెండు వికెట్లు మినహా మిగతావన్నీంటిని పేసర్లే పడగొట్టడం గమనార్హం.
తొలి స్థానానికి భారత్
న్యూజిలాండ్ మీద 0-3తో ఓటమి తర్వాత భారత్ డబ్యుటీసీ పాయింట్ల పట్టికలో తన తొలి స్థానాన్ని కోల్పోయింది. రెండో స్థానంలో ఉన్న ఆసీస్ తొలి స్థానంలోకి రాగా.. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టు విజయం తర్వాత తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకుంది.
భారత్ ప్రస్తుతం 61.11 విజయ శాతంతో తొలి స్థానంలో ఉండగా.. ఆసీస్ 57.69 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. నవంబర్ 30 నుంచి ప్రైమ్ మినిస్టర్స్-11 జట్టుతో భారత్ ఏ జట్టు రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు డే అండ్ నైట్‌గా జరగనుంది.