- కరీంనగర్ లో 2,660 ఇండ్లకు ఇకపై ప్రతిరోజు 24 గంటలపాటు
- మంచి నీళ్ల సరఫరా తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మంచినీరందించే నగరంగా
- రికార్డు స్రుష్టించనున్న కరీంనగర్ ముఖ్య అతిథిగా రానున్న కేంద్ర
- పట్టణాభివ్రుద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
కరీంనగర్, జనవరి23 (విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజంతా మంచి నీళ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ సునీల్ రావు ఈ దిశగా తొలి అడుగు వేయబోతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీ పరధిలోని 2,660 ఇండ్లకు ఇకపై ప్రతిరోజు 24 గంటలపాటు తాగు నీటిని సరఫరా చేసేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే ఇటీవల 24 గంటలపాటు తాగునీటి సరఫరా ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభయ్యాయి. చండీగడెడ్‌లోని మణిమజ్రా పట్టణంలో గత ఏడాది ఆగస్టులో 24/7 గంటలపాటు తాగునీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలో కూడా 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవు. కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోంది.
ఈనెల 24న కరీంనగర్ కార్పొరేషన్ లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు డివిజన్లో 4,055 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించాలనే ఆశయం నెరవేరడానికి అంకురార్పణ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివ్రుద్ది, గ్రుహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా ఖట్టర్ 2,200 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఆ తరువాత కొద్దిరోజుల్లోనే హౌజింగ్ బోర్డులో పరిధిలోని 4,055 ఇండ్లకు నిరంతరాయంగా మంచి నీళ్లు సరఫరా కానున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నగర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టిన నిరంతరాయ మంచి నీటి సరఫరా పనులన్నీ పూర్తయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇళ్లకు 365 రోజులపాటు తాగునీటిని అందించిన కరీంనగర్ కార్పొరేషన్ కు దక్కబోతోంది.
దీంతోపాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివ్రుద్ధి పనులను కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ స్టేడియంలో రూ.22 కోట్లతో నిర్మించిన స్పోరట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను, రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను, కేంద్ర మంత్రులు ఖట్టర్, బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
మరోవైపు కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్దనున్న డంప్ యార్డ్ తో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంకల్పించారు. అందులో భాగంగా నేడు కరీంనగర్ కు వస్తున్న మనోహర్ లాల్ ఖట్టర్ ను డంప్ యార్డ్ ను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డంప్ యార్డ్ నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా కేంద్ర మంత్రులు ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
దీంతోపాటు తొలిసారి హర్యానా మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ వస్తుండటంతో... హౌజింగ్ బోర్డు కాలనీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. మరోవైపు కరీంనగర్ సమగ్ర అభివ్రుద్ధి కోసం మరిన్ని ప్రణాళికలను రూపొందించిన బండి సంజయ్, సునీల్ రావు వీటి అమలు కోసం కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ సహకారం కోరనున్నట్లు సమాచారం.