calender_icon.png 1 October, 2024 | 3:25 AM

వేగంగా నియామకాలు!

01-10-2024 02:03:14 AM

పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలకు గతంలో అన్నీ అడ్డంకులే

అడ్డంకులను తొలగిస్తూ భర్తీలో వేగం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం

గత పదేండ్లలో ఒకే డీఎస్సీ.. ఈ ప్రభుత్వంలో 10 నెలల్లోనే ఒక డీఎస్సీ

ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేసిన సీఎం

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో రేవంత్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచుతోంది. రాష్ర్టంలో గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసింది.

అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలిగించి, ఫలితాలు విడుదల చేయటంతోపాటు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో ప్రకటించింది. 

* గత ప్రభుత్వం పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ౧౦ నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలను అందించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 

* గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3,967 పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసింది. 

* సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నిషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

* రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 8,304 మందికి  నియామక పత్రాలను అందించింది. 

టీజీపీఎస్‌సీ ద్వారా ఇలా

* టీజీపీఎస్సీ ద్వారా 26 వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా దాదాపు 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. 

*  ఇటీవలే ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.

* గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను టీజీపీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. 8,180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

సంక్షేమ శాఖలో.. 

*  సంక్షేమ శాఖలలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి. 

* గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 503 పోస్టులకు అదనంగా 60 పోస్టులు కలిపి మొత్తంగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 

* అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ మెయిన్స్  నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షెడ్యూలు ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిర్దేశించిన సమయానికి  పరీక్షలు, ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 

* పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించ లేకపోయింది. 

* దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించింది. 

మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 

* మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 డిసెంబర్లో నిర్వహించిన 7,094 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ లో పడ్డాయి.  

* ఫలితాలను విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది

బదిలీలు, పదోన్నతులు సైతం 

ఉద్యోగ నియామకాలే కాకుండా ఎన్నో ఏండ్లుగా పదోన్నతులు, బదిలీలు లేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న ప్రభుత్వ టీచర్లకు బదిలీలు, పదోన్నతులు ఈ ప్రభుత్వంలోనే దక్కాయి. పదకొండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకూ ఇటీవల బదిలీలు చేపట్టారు.