calender_icon.png 4 October, 2024 | 4:48 AM

గోసంరక్షులకే హిందువుల ఓటు

04-10-2024 01:15:55 AM

గోహత్యల నివారణతోనే మనకు ప్రాయశ్చిత్తం

33 కోట్ల దేవతలకు సేవ చేసేది గోమాతనే

గోసేవతోనే భగవంతుని దర్శనం సాధ్యం

జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి 

కోల్‌కతాలో గోప్రతిష్ఠ జెండాను స్థాపించిన స్వామీజీ

హావ్‌డా (పశ్చిమబెంగాల్), అక్టోబర్ 3: హిందువులు గోసంరక్షులకే ఓటు వేయాలని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ పిలుపుని చ్చారు. పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా శంకర్‌మఠ్‌లో గురువారం భక్తులను ఉద్దేశించి మాట్లాడిన శంకరాచార్య స్వామీజీ.. ఎప్పుడై తే దేశంలో గోహత్యలు ఆగిపోతాయో అప్పుడే మన పాపాలకు నివారణ లభిస్తుందని చెప్పారు.

గోధ్వజ్ స్థాపన భాగంగా యాత్రలో భాగంగా 12వ రోజున హావ్‌డాలోని శంకర్‌మఠ్‌లో గోప్రతిష్ఠ జెండాను శంకరాచార్య స్వామీజీ స్థాపించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ..శక్తిపూజను ఘనంగా నిర్వహించే బెంగాల్ భూమిపై నవరాత్రి ప్రారంభం రోజున గోప్రతిష్ఠ జెండాను ఆవిష్కరించా.

గోసంరక్షణకు పాటుపడే గోపాల్‌మణి ఆందోళన అత్యంత పవిత్రమైంది. ఆయన చేస్తున్న కృషికి మద్దతిచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నా. పాలు, మాంసం ఇచ్చేదే ఆవుగా భావించేవారు దాని ప్రాముఖ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలే రు. భగవద్గీతలో యజ్ఞం గురించి చెప్పారు. మనందరం పరస్పరం ఒకరికోసం మరొక రు జీవించాలని బోధించారు అని వివరించారు. 

గోమాతలో ఉండేదీ మాతృత్వమే

భగవంతుని చూడాలంటే గోమాతకు సేవ చేయాలని, ఆవుల మధ్యనే తాను ఉంటానని భగవంతుడు చెప్పినట్లు శంకరాచార్య పేర్కొన్నారు. ప్రతి అమ్మలో ఉండేది మాతృత్వమేనని, అది గోమాతకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పారు. గోమాతను లలితాసహస్రనామంలో భగవతిగా పేర్కొన్నారని, గోమాత అందరి కోర్కెలు తీరుస్తుందని తెలిపారు. సనాతన ధర్మం పాటించే మనం ఆవు నుంచి పాలు మాత్రమే కాదు, ఆశీర్వాదం కూడా తీసుకుంటామని గుర్తుచేశారు. 

ఈ యాత్ర రేపు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చేరుకుంటుందని, అనంతరం అక్టోబర్ 5న రాంచీలో గోధ్వజ్ స్థాపన జరుగుతుందని తెలిపారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమం లో స్వామి ప్రజ్ఞానంద సరస్వతి, స్వామి అంబరీశానంద సరస్వతి, బ్రహ్మచారి బ్రహ్మవిద్యానంద్, డాక్టర్ పర్‌నాథ్ మిశ్రా, గోగంగా యాత్ర నిర్వాహకులు గోపాల్‌మణి, స్వామి రామనంద్‌తీర్థ, స్వామి తేజేశ్వరానంద సరస్వతి, యాత్ర ఇన్‌చార్జి ముకుందానంద బ్రహ్మచారి, కార్యదర్శి దేవేంద్రపాండే, బెంగాల్ ఇన్‌చార్జి నిరంజన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి సందర్భంగా ఉత్సవాల్లో అవిముక్తేశ్వరానంద స్వామీజీ పాల్గొన్నారు. శక్తిమాతకు గంగాహారతి ఇచ్చారు. అంతకుముందు కోల్‌కతాలోని పరాంబ భగవతి శ్రీ విద్యాంబ ఆలయాన్ని శంకరాచార్య దర్శించుకున్నారు. 

గోమాత లేని పూజలు నిరర్ధకమే

ఈ సందర్భంగా పురాణాలను ప్రస్తావించిన శంకరాచార్య స్వామీజీ.. ప్రజా పతి బ్రహ్మ విందు గురించి వివరించా రు. బ్రహ్మ ఏర్పాటు చేసిన విందుకు దేవుళ్లు, రాక్షసులు, మానవులకు ఆహ్వా నం పంపారు. వంటలన్నీ పూర్తయ్యాక వండించేవాళ్లను తాళ్లతో కట్టేశారు. దీం తో రాక్షసులు విందును బహిష్కరించి అక్కడినుంచి వెళ్లిపోయారు.

దేవతలు, మానవులు మాత్రం ఒకరికొకరు వడ్డించుకుంటూ విందును ఆస్వాదించారు. భారతీయులందరం ఇతరులకు తిండిపెట్టడంలో సంతృప్తి చెందుతాం. దేవుళ్లకు నైవేద్యం, బంధువులు, మిత్రులకు వంటకాలు చేసేందుకు ఇష్టపడుతాం. దీన్నే యజ్ఞంగా భావిస్తాం. కానీ యజ్ఞాలు, హోమాలతో దేవుళ్లు సంతృప్తి చెందుతా రు.

వాటిని పూర్తి చేసేది బ్రాహ్మణులు, గోవులు. గోమాత లేకుండా ఎన్ని పూజ లు చేసినా నిరర్ధకం. 33 కోట్ల దేవతల కు సేవ చేసేది గోమాతనే స్వామీజీ వివరించారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాజ్యమాతగా ప్రకటించే వేళ ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పిలుపుతో యాత్ర ను మధ్యలోనే వదిలి ముంబై వెళ్లినట్లు చెప్పారు.