- బంగ్లాదేశ్‌లో దాడులకు వ్యతిరేకంగా అమెరికా, యూరోప్‌లో నిరసనలు
- తమపై హింసకు వ్యతిరేకంగా ఆందోళనలు
- అమెరికా, యూరోప్‌లోనూ నిరసనలు
- మైనారిటీలపై దాడులను ఖండించిన యూనస్
- వాళ్లను రక్షించాలని విద్యార్థులకు సూచన
ఢాకా (బంగ్లాదేశ్), ఆగస్టు 12: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా హిందువులు నిరసనలు వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంఘీభావం తెలియజేస్తున్నారు. అమెరికా, యూరోప్‌లోని పలు దేశాల్లో వీరికి మద్దతుగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిట్టగాంగ్‌లో జరిగిన ప్రదర్శనలో 7 లక్షల మంది హాజరైనట్లు అంచనా. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
అమెరికాలోనూ..
బంగ్లాలో హిందువులపై దాడిని నిరసిస్తూ అమెరికా హ్యూస్టన్ నగరంలో వందల మంది భారత సంతతి అమెరికన్లు, బంగ్లాదేశ్‌కు చెందిన హిందువులు నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాలో మతపరమైన మైనారిటీలక రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు. హిందువులపై మారణహోమాన్ని ఆపాలని, హిందూ లైవ్స్ మ్యాటర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుత బంగ్లా సంక్షోభంతో కోటి మంది హిందువులు భయాందోళనలతో బతుకుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తనతో చర్చలకు రావాలని హిందూ విద్యార్థి నేతలతో పాటు హిందూ సంఘాలకు యూనస్ పిలుపునిచ్చారు. హిందూ సమాజానికి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. మైనారిటీలపై తీవ్ర దాడులు జరిగినట్లు క్యాబినెట్ ప్రమాణస్వీకారం తర్వాత తన మొదటి అధికార ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
8 డిమాండ్లు
తమ హక్కులను కాపాడేందుకు మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 8 డిమాండ్లతో కూడిన జాబితాను యూనస్‌కు హిందూ విద్యార్థి సంఘాలు అందజేశాయి. హిందువులపై దాడుల కేసుల్లో సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ ట్రైబ్యునల్ ఏర్పాటు, మైనారిటీ రక్షణ చట్టం, హిందూమత సంక్షేమ ట్రస్ట్‌ను ఫౌండేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం, పాలీ ఎడ్యుకేషన్ బోర్డును ఆధునికీకరించడం తదితర అంశాలు ఉన్నాయి. దుర్గా పూజ సమయంలో సెలవు ప్రకటించాలని కోరారు.