calender_icon.png 5 December, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ హిందువుల కోసం కదం తొక్కిన హిందూ ఐక్యవేదిక

05-12-2024 12:00:22 AM

కరీంనగర్‌లో భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట నిరసన

కరీంనగర్ (విజయక్రాంతి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న నిరంతరం దాడులను నిరసిస్తూ కరీంనగర్ హిందూ ఐక్య వేదిక  బుధవారం కరీంనగర్‌లో భారీ నిరసన, ఆందోళన కార్యక్రమం చేపట్టింది. నగరంలోని గోపికృష్ణ ఫంక్షన్‌హాల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి అంటూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు, హిందూ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని, హిందువులకు రక్షణ కల్పించమని అడిగినందుకు ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణదాస్‌ను జైల్లో వేశారని, ఆయనకు అండగా నిలిచిన వారిపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులు రోజురోజుకు అధికమయ్యాయన్నారు. హిందువులు, ఇతర మతపరమైన మైనార్టీలలపై నిరంతరం దాడులు, హత్యలు, దోపిడీలు, మహిళలపై అమానవీయ వేధింపులు పెరిగిపోతున్నాయని, ఇవి తీవ్రమైన ఆందోళనకరమన్నారు. దీన్ని హిందూ ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బంగ్లాదేశ్ ఇప్పటికైనా హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను నివారించడానికి అన్ని విధాల కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ అనుమండ్ల రాజిరెడ్డి, కోతైటోకన్వీనర్లు డాక్టర్ రమణాచారి, ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, రామ్‌కిరణ్, పి కిషన్, కిరణ్‌సింగ్, ఆది శ్రీనివాసరావు, పీఠాధిపతులు సనక సనంద స్వామీజీ, పురాం మహేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు.