calender_icon.png 1 March, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీ రాజకీయాలు!

01-03-2025 12:00:00 AM

తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రాజకీయాలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయకపోతే సర్వశిక్ష అభియాన్ కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన రూ.2,500 కోట్ల నిధులు ఆపేస్తామం టూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి బీజం వేసింది.

కేంద్రమంత్రి ప్రకటనపై మండిపడిన స్టాలిన్ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులను ఆపడమేమిటని ప్రశ్నించారు. తాము రెండు భాషల విధా నాన్ని వదులుకోబోమని స్పష్టం చేశారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరో అడుగు ముందుకు వేసి ఇది ద్రవిడ భూ మి అని స్పష్టం చేశారు.

తమిళ ప్రజల హక్కులు హరించడానికి యత్నించినప్పుడు ‘గో బ్యాక్ మోదీ’ ప్రారంభించారు.  మరోసారి ప్రయత్నిస్తే ‘గె ట్ అవుట్ మోదీ’ అనే స్వరం వినిపిస్తుందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మేంద్రప్రధాన్ స్పందిస్తూ  ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదంటూ స్టాలిన్‌కు లేఖ రాశారు. వాస్తవానికయితే అక్కడితో ఈ వివాదం చల్లారాలి.

కానీ స్టాలిన్ ఈ వివాదాన్ని మరింత ఎగదోస్తున్నారు. హిందీ దాదాపు 25 ఉత్తరాది భాషలను మింగేసిందంటూ మరో సంచలన ఆరోపణ చేశారు. హిందీ కారణంగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్,చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భోజ్‌పురి లాంటి స్థానిక భాషలు నాశనమయ్యాయన్నది ఆయన ఆరోపణ.

తమిళనాడు, కేంద్రం మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ ప్రభు త్వం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది. ఇది పరోక్షంగా తమిళనాడు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపడమేనని పరిశీలకుల భావన.

స్టాలిన్ కూడా హిందీకి వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆం దోళనకు పంజాబ్, తెలంగాణలు కూడా మద్దతు ఇస్తున్నాయని చెప్పడం గమనార్హం. అంతేకాదు, ఈ అందోళనలో రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలని కూడా ఆయన పిలుపునివ్వడం చూస్తే ఈ ఆందోళన ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు.

వాస్తవానికి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలకు చాలా చరి త్రే ఉంది. 1937లో సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని మొదటి జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీ పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన ప్రారంభమైంది. దీనికి పెరియార్ ఈవీ రామస్వామి, అప్పటి ప్రతిపక్ష జస్టిస్ పార్టీ నుంచి తక్షణ వ్యతిరేకత మొదలైంది.

1939లో ప్రభుత్వం రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ ఎర్స్‌కైన్ తప్పనిసరి హిందీ విద్యను ఉపసంహరించుకున్నారు. అప్పటి జస్టిస్ పార్టీ యే ఆ తర్వాతి కాలంలో డీకేగా, డీఎంకేగా రూపాంతరం చెందింది. 1960 దశకంలో మరోసారి వచ్చిన హిందీ వ్యతిరేక ఆందోళన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేసింది.

1967లో అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు కూడా ఈ ఆందోళనకు నేపథ్యం అదేననిపిస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో కాలు పెట్టలేకపోయిన బీజేపీ ఈ సారి ఎలాగైనా తన సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు సినీనటుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే డీఎంకే రాష్ట్ర ఓటర్లపై తన పట్టును కోల్పోకుండా  ఉండడానికి ఈ హిందీ వ్యతిరేక ఆందోళనను ఆయుధంగా చేసుకొంటున్నట్లు కనిపిస్తోంది. విశేషం ఏమిటంటే కేంద్రం వైఖరిని ఒక్క బీజేపీ నేతలు తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఈ హిందీ వ్యతిరేక ఆందోళన ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.