- బాలీవుడ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు
- ఇతర చిత్రాలను తొక్కేస్తున్నారంటూ మండిపాటు
న్యూఢిల్లీ, నవంబర్ 3: బాలీవుడ్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కడ కేవలం హిందీకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. మరాఠీ, భోజ్‌పురి, బీహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు.
ఉత్త రాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవన్నారు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను పరిరక్షించుకోవడంలో ఫెయిల్ అయితే.. ఆ స్థానాన్ని హిందీ ఆక్రమించే అవకాశం ఉందన్నారు. అయితే హిందీ భాషకు తమిళనాడు వ్యతిరేకం కాదని.. దానిని బలవంతంగా రుద్దడానికి మాత్రమే వ్యతిరేకమన్నారు.
ఈ మేరకు ఆదివారం మనోరమ డెయిలీ గ్రూప్ నిర్వహించిన ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1920వ దశకంలో వైద్య విద్యాలో ప్రవేశించడానికి సంస్కృతంలో పరిజ్ఞానం తప్పనిసరి అని .. ఇది అప్పట్లో వెనుకబడినవారిని వైద్య విద్యలో చేరకుండా నిరోధించిందని.. అలాగే నేడు నీట్ కారణంగా ఎంతోమంది నిరుపేదలు వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటివారు తమిళ సాహిత్యాన్ని విస్త్రృతంగా వినియోగించారని స్టాలిన్ పేర్కొన్నారు. సంస్కృతి, భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం అని స్టాలిన్ అన్నారు.