- దీనితోనే ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కింగ్‌డన్ షార్ట్ పొజిషన్లు
- సెబీ ఆరోపణ
ముంబై, జూలై 7: గత ఏడాది అదానీ గ్రూప్ సంక్షోభానికి కారణమైన యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ తన రీసెర్చ్ రిపో ర్ట్ ముందుగానే క్లయింట్లకు లీక్ చేసినట్టు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపించింది. ఆదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ తయారుచేసిన నివేదికను ప్రచురించడానికి రెండు నెలల ముందుగానే న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్‌డన్‌కు అందించిందని సెబీ పేర్కొంది. దీంతో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రచురితం కాకముందే కింగ్‌డన్ కేఎంఐఎల్ (కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్) ద్వారా అదానీ ఎంటర్ ప్రైజెస్ (ఏఈఎల్)లో షార్ట్ పొజిషన్లు తీసుకుని భారీగా లబ్దిపొందినట్టు సెబీ ఆరోపించింది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ 2023 జనవరి 23న వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ గ్రూప్ 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను నష్టపోయింది. రిపోర్ట్ ప్రచురించకముందు కింగ్‌డన్ రెండు విడతల్లో 44 మిలియన్ డాలర్లను కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు మారిషస్ సబ్సిడరీ అయిన కేఎంఐఎల్‌కు బదిలీ చేయగా, ఆ నిధులతో కేఎంఐఎల్ ట్రేడర్లు ఆదానీ ఎంటర్ ప్రైజెస్‌లో షార్ట్ పొజిషన్లు బిల్డప్ చేశారు.
రిపోర్ట్ వెల్లడయినందనే షేరు నిలువునా పతనమైనపుడు ఆ పొజిషన్లు కవర్ చేయడం ద్వారా కింగ్‌డన్ 22 మిలియన్ డాలర్లకుపైగా (దాదాపు రూ.183 కోట్లు) లబ్దిపొందినట్టు సెబీ ఇటీవల హిండెన్‌బర్గ్‌కు జారీచేసిన షోకాజ్ నోటీసులో వివరించింది. తప్పుడు సమాచారం, ఇన్‌సైడర్‌తో కుమ్మక్కై అనైతిక లాభాల్ని ఆర్జించారంటూ, అందుకు తగిన చర్యలు చేపడతామంటూ షోకాజ్‌లో హిండెన్‌బర్గ్‌ను హెచ్చరించింది.