calender_icon.png 25 December, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివాళా దిశగా హిమాచల్!

03-11-2024 01:46:04 AM

ఉచితాలతో ఖజానాపై భారం

అప్పులు, పథకాల భారంతో ఉక్కిరిబిక్కిరి

కర్ణాటకలోనూ అదే పరిస్థితి పథకాల్లో కోతలకు 

కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయం!

హస్తం పార్టీపై విపక్షాల తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎన్నికల వాగ్దానాలపై ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధంతో మరోసారి ఉచిత హామీలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక నెరవేర్చే దారి లేక కోతలు పెడుతన్నదని విమర్శలు వస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ కారణంగానే బడ్జెట్, పరిస్థితులకు అనుగుణంగానే హామీలు ఇవ్వాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ సారథులకు ఖర్గే సూచించారని చెబుతున్నారు. 

తలసరి అప్పులో హిమాచల్ టాప్

ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌లో అధికారంలో ఉంది. కాగా, హిమాచల్ ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోందని నివేదికలు చెబుతున్నాయి. జీతాలు చెల్లించలేనంతగా దివాళా తీసిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.17 లక్ష ల అప్పు భారం ఉంది. హిమాచల్ మొత్తం అప్పులు రూ.94 వేల కోట్లు ఉన్నట్లు సమాచారం. పరిమితికి మించిన అప్పులు, వాటి వడ్డీ చెల్లింపులు, పథకాల భారంతో సీఎం సుఖ్వీందర్‌సింగ్ సర్కారు ఇబ్బందులు పడుతోందని చెబుతున్నారు. ఆఖరికి పెన్షనర్ల సంక్షేమ నిధి డబ్బులను ప్రభుత్వం వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి.  

పథకాల్లో కోతకు నిర్ణయం

రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 10 హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. నెలకు మహిళ లకు రూ.1,500 భత్యం ఇవ్వడం రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం మోపిందని అధికారులు చెబుతున్నారు. దీంతో హామీలను అమలు చేయలేకపోగా ఉన్న పథకాల్లోనూ కత్తెర పెడుతున్నారనే అసంతృప్తి చెలరేగుతోంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. అది అమలు చేయలేదు. పైగా 125 యూనిట్ల విద్యుత్ సబ్సిడీపైనా కోతలు విధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించి 50 శాతం టికెట్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకా కుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం సమయానికి పడటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులకు డీఏ, అలవెన్సులు ఇచ్చేందుకూ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ఆర్థిక సంక్షోభానికి కారణమని చెబుతున్నారు. 

ఇదే బాటలో కర్ణాటక 

కర్ణాటకలోనూ ఎన్నికల సందర్భంగా అనేక ఉచిత హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ గ్యారెంటీల అమలు రాష్ట్రంపై ఆర్థిక భారం మోపిందని తెలుస్తోంది. దీంతో ధరలు పెంచి ఖజానా నింపాలని సిద్ధరామయ్య సర్కారు ప్రయత్నిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పునఃపరిశీలిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో సిద్ధరామయ్య అలాంటిదేమీ లేదని ప్రకటన చేశారు. ఇదే తరుణంలో ఖర్గే హామీల ప్రకటనపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ మరింత ఇబ్బందుల్లో పడినట్లయింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది.