calender_icon.png 16 November, 2024 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజల పేరుతో హిజ్రా ఘరానా మోసం

16-11-2024 03:57:26 AM

దోషాలు తొలగిస్తానని రూ.55 లక్షలు వసూలు

పరారీలో ట్రాన్స్‌జెండర్ 

జనగామ, నవంబర్ 15 (విజయక్రాంతి): పూజల పేరుతో ఓ హిజ్రా ఘరానా మోసానికి పాల్పడింది. ఓ మహిళ వద్ద పెద్ద మొ త్తంలో డబ్బులు దోచేసి ఉడాయించింది. రూ.55 లక్షల వరకు వసూలు చేసి మొహం చాటేసిన ఘటన జనగామ జిల్లాకేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మం డలం సత్యనారాయణపురానికి చెందిన ట్రాన్స్‌జెండర్ నాగదేవి ఇండ్లల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ, భక్తులు ఇచ్చే దక్షిణతో కాలం వెళ్లదీస్తోంది.

అలా ఆమెకు నిరోషా అనే మహిళ ద్వారా జనగామ పట్టణంలోని వెంకన్నకుంటకు చెందిన ఉప్పల సిరివెన్నెలతో పరిచయమైంది. సిరివెన్నెల తన ఇంట్లో ఏదీ కలిసి రావడం లేదని నాగదేవికి చెప్పింది. దీంతో నాగదేవి పథకం పన్నింది. ప్రత్యేక పూజలు చేస్తే అంతా కలిసి వస్తుందని, దోషాలన్నీ పోతాయని చెప్పి సిరివెన్నెల నుంచి రూ.15 లక్షలు తీసుకున్నది. తర్వాత మరో రూ.40 లక్షలు వసూలు చేసింది. తర్వాత నాగదేవి పూజలు చేసినట్లు చెసి ముఖం చాటేసింది.

పూజల అనంతరం తమ జీవితంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నాగదేవిని సిరివెన్నెల కుటుంబం నిలదీసింది. తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన సిరివెన్నెల గురువారం రాత్రి జనగామ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

బీరప్పగడ్డలో మరో బాధితుడు..

ట్రాన్స్‌జెండర్ నాగదేవి పూజల పేరుతో చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెంకన్నకుంటకు చెందిన సిరివెన్నెల వద్ద రూ.55 లక్షలు తీసుకున్న ఘటన బయటకు రాగానే, జనగామ పట్టణంలోని బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. పూజల పేరుతో అతడి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.