పోలీసుల అదుపులో మరో నలుగురు
రూ.34 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ, నవంబర్ 16:దోషాలు తొలగించి ఇంట్లో శుభం కలిగేలా చేస్తానని నమ్మించి ఓ మహిళ వద్ద హిజ్రా రూ.55 లక్షలు కాజేసిన ఘటనలో జనగామ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.34.36లక్షల విలువైన ఆభరణాలను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను జనగామ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం విలేకరులకు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన భట్టు నాగదేవి (ట్రాన్స్‌జెండర్) మూడేళ్ల క్రితం జనగామలోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలో నివాసం ఉండేది. ఈమె 2023లో బాణాపురానికి చెందిన పాముకుంట్ల సందీప్‌ను వివాహం చేసుకుంది.
భిక్షాటన ద్వారా వచ్చే డబ్బులు వీరికి సరిపోకపోవడంతో దోష నివారణ పూజల పేరుతో ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టింది. ఇటీవల వెంకన్నకుంటకు చెందిన సిరివెన్నెల మరో మహిళ ద్వారా నాగదేవిని సంప్రదించగా.. పూజల పేరుతో విడతల వారీగా రూ.55లక్షలు, ప్లాట్ డాక్యుమెంట్లను తీసుకున్నది.
మోసపోయానని గ్రహించిన సిరివెన్నెల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం పక్కా సమాచారంతో నెహ్రూ పార్క్ వద్ద సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేపట్టి ఓ కారులో వెళ్తున్న నాగదేవిని అదుపులోకి తీసుకున్నారు.
నాగదేవితో పాటు సందీప్, మెతుకు గణేశ్, నవీన్, భూక్యా గణేశ్‌ను అరెస్టు చేసి కారు, 30 తులాల బంగారం, 20 తులాల వెండి, 4.6 గ్రాముల బంగారానికి సంబంధించిన ముతూట్ డిపాజిట్ స్లిప్, రెండు ల్యాండ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ పార్థసారథి, సీఐ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.