calender_icon.png 5 February, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవే సర్వీస్ రోడ్డు ఆక్రమణ

05-02-2025 12:00:00 AM

  1. పార్కింగ్ కేంద్రాలుగా సర్వీస్ రోడ్డు
  2. వాహనదారులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు
  3. రోడ్డును ఆక్రమిస్తున్న వ్యాపారులు

ఎల్బీనగర్, ఫిబ్రవరి ౪ : వందల కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడ జాతీయ రహదారిని విస్తరించినా.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఇప్పటికీ ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ఎనిమిది లైన్ల నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న కాలనీలకు వెళ్లడానికి వీలుగా సర్వీస్ రోడ్లను నిర్మించారు. కాగా, సర్వీస్ రోడ్డు వెంబడి భారీ షాపింగ్ మాల్స్, హోటళ్లు, షోరూమ్ లు, వాణిజ్య భవనాలు ఉన్నాయి.

వినియోగదారులు తమ వాహనాలను సర్వీస్ రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ఇతర వాహనాలు వెళ్లలేకుండా ఉన్నది. వీటితోపాటు చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు సర్వీస్ రోడ్డును అక్రమించి, వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో సాయంత్రం, రాత్రివేళల్లో సర్వీస్ రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్లకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

 ముఖ్యంగా చింతలకుంట, పనామా, సుష్మా టాకీస్ వరకు ఎడమవైపు ఉన్న సర్వీస్ రోడ్డు పూర్తిగా పార్కింగ్ రోడ్డుగా మారింది. ఈ రోడ్డులో అనేక షాపింగ్ మాల్స్, హోటళ్లు, వైన్స్ లు, బార్లు ఉన్నాయి. వీటితోపాటు చిరువ్యాపారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలపడంతో సర్వీస్ రోడ్డు పూర్తిగా పార్కింగ్ కేంద్రాలుగా మారాయి. ఆటోనగర్, డీర్ పార్కు, పూల్లారెడ్డి స్వీట్ షాపు, హయత్ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, వినాయక నగర్, హయత్ నగర్ బస్టాప్ వరకు ఉన్న సర్వీస్ రోడ్డును పూర్తిగా చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు అక్రమించి, రోడ్డుపైనే క్రయవిక్రయాలు చేస్తున్నారు. కొనుగోలుదారులు తమ వాహనాలను అక్కడే నిలిపి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సర్వీస్ రోడ్డు పూర్తిగా వాహనాల పార్కింగ్ ప్లేస్ గా మారింది. ఫలితంగా ఇతర వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం, రాత్రి వేళలో చింతలకుంట నుంచి హయత్ నగర్ బస్టాప్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

హయత్ నగర్ లో సర్వీస్ రోడ్డుపై సంత..

హయత్ నగర్ లోని వినాయక నగర్ లో సర్వీస్ రోడ్డుపైనే వారంవారం సంత నిర్వహిస్తున్నారు. వారాంతపు సంతతో సర్వీస్ రోడ్డుపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయి. హైవే రోడ్డుపై ఇరువైపులా బారికేడ్లను నిర్మించడంతో వాహనాలను పక్కకు మళ్లించడానికి వీలులేకుండా ఉండడంతో వాహనాలు వెళ్లేలేని పరిస్థితి నెలకొన్నది.

ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు రోడ్డును అక్రమిస్తున్నవారిని తరలించి, ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చడానికే జాతీయ రహదారిని వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సర్వీస్ రోడ్లను వ్యాపారులు అక్రమించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరడం లేదని వాహనదారులు వాపోతున్నారు. 

సర్వీస్ రోడ్లను ఆక్రమిస్తే కఠినచర్యలు 

విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. రోడ్డును అక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్ర, రాత్రి వేళలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చిరువ్యాపారులు రోడ్డును అక్రమించకుండా వ్యాపారం చేసుకోవాలని సూచిస్తున్నాము.

జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం.  చిరువ్యాపారులు రోడ్డును అక్రమించకుండా వ్యాపారం చేసుకోవాలని సూచిస్తున్నాము. జాతీయ రహదారి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులన్నీ పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి. సర్వీస్ రోడ్డులో వాహనాలను నిలిపితే చర్యలు తీసుకుంటాం. షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు సైతం పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవాలని సూచించాము. 

  గట్టుమల్లు, వసస్థలిపురం 

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్