13-04-2025 01:12:50 AM
బయట ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కాలంలో వృద్ధులు త్వరగా శక్తిని కోల్పోతుంటారు. వారి శక్తి స్థాయి, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థపై వేసవి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేడి వాతావరణం డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఇది బద్ధకం కలిగిస్తుంది. వృద్ధులు వడదెబ్బ, ఇతర వేసవి అనారోగ్యాలను నివారించడానికి కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవాలను బాగా తీసుకోవాలి. పుష్కలమైన నీరు తాగడం ద్వారా వృద్ధుల్లో శరీర వేడి తగ్గి ఆరోగ్యానికి దోహదపడనుంది. సమతుల భోజనం తినేలా జాగ్రత్తపడాలి. కాలానుగుణమైన పండ్లు, కూరగాయలు, గింజలు, అధిక నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
బయటకు వెళ్లేముందు..
ఎండ ఎక్కువగా కాసే సమయంలో ముఖ్యంగా ఉదయం పది నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతగా అవసరమైతే ఉదయం కాని, సాయంత్రం కాని బయటకు వెళ్లేలా జాగ్రత్తపడాలని తెలిపారు. ఒకవేళ పగటి పూట బయటకు వెళ్తే విధిగా గొడుగు, వెడల్పయిన అంచుల టోపీ, చలువ కళ్లద్దాలు ధరించాలి.
చల్లదనం..
వేసవిలో వృద్ధుల సంరక్షణకు ఇంట్లో చల్లగా ఉండే వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు. హాలులో, పడకగదిలో ఫ్యాన్లు, కూలర్లు లేదా ఏసీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కిటికీలకు, తలుపులకు పరదాలైనా వేలాడదీయొచ్చని.. వీటిని నీటితో తడిపితే ఇల్లు చల్లగా అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం
ముఖ్యంగా వృద్ధులకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ, సొరకాయ, బీరకాయ వంటి పండ్లు, కూరగాయలు తినాలి. ఇవి అవసరమైన పోషకాలను అందిస్తూనే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా కాపాడి వేసవి నీరసాన్ని తగ్గిస్తాయి.
వాతావరణం
వాతావరణ సంస్థలు జారీ చేసే ఉష్ణోగ్రత వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా వడగాలులు వీచే అవకాశముంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వేడి గాలి రాకుండా జాగ్రత్త పడాలని.. ఎందుకంటే ఇంట్లో ఉండే వేడిగాలి కూడా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
దుస్తులు
ఎండాకాలంలో ముదురు రంగుకు బదులు లేత రంగు దుస్తులు ధరించేలా చూడాలని.. వదులైనవి, నూలు దుస్తులైతే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరం చుట్టూ గాలి ఆడేలా చేయడం ద్వారా చల్లదనం కల్పిస్తాయని.. వేడి వాతావరణంలోనూ హాయినిస్తాయి.