హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : రంగారెడ్డి జోన్‌లో 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు 400 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది ఏప్రిల్ 15వ తేదీ నాటికి అత్యధికంగా 1579 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 32.96 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగం అయింది. ఈ ఏడాది అత్యధిక వినియోగం 1979 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏప్రిల్ 5వ తేదీ నాటికే చేరుకోవడం విశేషం. 2023 ఏప్రిల్ 23వ తేదీ నాటికి 1348 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 29.92మిలియన్ యూనిట్ల వినియోగం నమోదు కాగా, 2024 ఏప్రిల్ 23 నాటికి అత్యధికంగా 1661 మెగావాట్ల విద్యు త్ డిమాండ్‌తో 37.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారులు వినియోగించినట్టు రంగారెడ్డి జోన్ సీజీఎం పి.ఆనంద్ తెలిపారు. రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, వికారాబాద్, సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. సీఎండి ముషరఫ్ ఫారూ ఖ్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాలో వచ్చే సమస్యలను పరిష్కారానికి అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్దంగా పని చేయడం కారణంగానే గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ముఖ్యంగా ట్విట్టర్, యాప్, ఎఫ్‌ఓసి, టోల్‌ఫ్రీ 1912 ద్వారా వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తున్నట్టు సీజీఎం ఆనంద్ తెలిపారు.
అదనపు పీటీఆర్‌లతో లోడ్ సమస్యకు పరిష్కారం
జోన్ పరిధిలో వేసవిలో విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యలను అధిగమించేందుకు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తు న్నట్టు సీజీఎం పి. ఆనంద్ తెలిపారు. కొత్తగూడ, అయ్యప్ప సొసైటీ, సెజ్ సబ్ స్టేషన్ల లో ప్రస్తుతం 12.5 ఎంవిఏ పిటీఆర్‌లు ఉండ గా, వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా మరో 8 ఎంవిఏ పిటీ ఆర్‌లను అదనంగా ఏర్పాటు చేశామని అన్నారు. అదనపు పీటీఆర్‌లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 45వేల విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. నందనవనంలో అదనంగా 8 ఎంవిఏ పిటీఆర్‌లు, తుర్కయాంజల్‌లో 5నుంచి 8వరకూ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పిటీఆర్‌లు సమకూర్చడం వల్ల దాదాపు 85వేల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాల మేరకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు లోడ్‌లను ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్య క్రమంలో పలువురు విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.