- టీడీఎస్ ప్రవేశపెట్టే యోచన
న్యూఢిల్లీ, జూన్ 21: స్టాక్ మార్కెట్లో డెరి వేటివ్ కాంట్రాక్టులైన ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ను (ఎఫ్ అండ్ ఓ) లాటరీ, క్రిప్టో కరెన్సీ తరహా స్పెక్యులేటివ్ సాధనాలుగా పరిగణించి, వాటిపై ఒనగూడే ఆదాయంపై వచ్చే బడ్జెట్లో అధిక పన్ను విధిస్తారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. డెరివేటివ్ మార్కెట్లో రిటైల్ ట్రేడర్లు గణనీయంగా నష్టపోతున్నందున, అధిక పన్నును ప్రతిపాదించవచ్చని కథనం పేర్కొంది. ఎఫ్ అండ్ ఓ లావాదేవీల ద్వారా ఒనగూడే ఆదాయాన్ని ‘బిజినెస్ ఆదాయం’ నుంచి ‘స్పెక్యులేటివ్ ఆదాయం’గా వర్గీకరిస్తారు. టీడీఎస్‌ను కూడా ప్రవేశపెట్టే యోచన ఉన్నది.
ఈ మార్పుతో లాటరీలు, క్రిప్టోకరెన్సీల తరహాలో ఎఫ్ అండ్ ఓ ఆదాయంపై పన్ను ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్ అండ్ ఓ ఆదాయాన్ని బిజినెస ఆదాయంగా పరిగణించి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తున్నారు. అలాగే ఎఫ్ అండ్ ఓలో వచ్చిన లాభాలను ఇతర వ్యాపార కార్యకలాపాల్లో వచ్చిన నష్టాలతో ఆఫ్‌సెట్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. మరోవైపు ఎఫ్ అండ్ ఓకు టీడీఎస్‌ను (ట్యాక్స్ డిడెక్టడ్ ఎట్ సోర్స్) వర్తింపచేయడం ద్వారా మార్కెట్లో ఇన్వెస్టర్లను ప్రభుత్వం ట్రాక్ చేయగలుగుతుంది. తరచూ ట్రేడింగ్ చేయడాన్ని నిరోధిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.