12-03-2025 07:17:46 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సమగ్ర వ్యవసాయంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V. Patil) అన్నారు. బుధవారం రామవరంలోని రైతు వేదికలో వాలంతరి, రాజేంద్రనగర్ హైదరాబాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బృందంతో ఏఈఓలకు, రైతులకు నీటి నిర్వహణ, మట్టి, నీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమగ్ర వ్యవసాయంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని ఇందుకుగాను నీటి కుంటల నిర్మాణం, మునగ సాగు, ఆయిల్ ఫామ్, అజోల్ల పెంపకం, తిప్ప, కరక్కాయ వంటి ఔషధ మొక్కలను పుట్టగొడుగుల పెంపకం, పెంపకం, తుల పెంపకం ద్వారా రైతులు అదనంగా ఆదాయం సంపాదించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని ఏఈఓలను ఆదేశించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి జిల్లాలోని వ్యవసాయకు సంబంధించిన ప్రస్తుత పంటల యొక్క సమస్యలు మరియు పరిష్కారాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు,వాలంతరీ డైరెక్టర్ విజయ గౌరీ, వ్యవసాయ సహాయ సంచాలకులు నరసింహారావు మరియు వాలంతరీ ఏ డి ఏ సునీత మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.