calender_icon.png 3 October, 2024 | 5:57 AM

మూసీపై హైఓల్టేజ్

03-10-2024 02:49:10 AM

డబ్బు సంచుల కోసమే ‘మూసీ’ 

  1. పేదల ఇండ్లపైకి రాహుల్ బుల్డోజర్
  2. కాంగ్రెస్‌కు కావాల్సింది నోట్ల కట్టలు 
  3. సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదు 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): డబ్బు సంచుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అనుమతిచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీనే వెనుక ఉండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని ఆరోపించారు.

హైడ్రాను నడిపిస్తోంది సీఎం రేవంత్‌రెడ్డి కాదని, రాహుల్‌గాంధీయేనని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేయడానికి, కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంకులాగా చేసేందుకు రేవంత్ సర్కార్ పేదల కడుపు కొడుతోంది.

రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ఎవరు చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. అభినవ గోబెల్స్ రేవంత్‌రెడ్డినే ఈ విషయాన్ని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రుల మధ్య సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదు.

మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో రెండుమూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయటపెడుతా. ప్రభుత్వం చేసే అవినీతిని బయపడుతా’ అని కేటీఆర్ ప్రకటించారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్‌గాంధీ ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

చిన్న పిల్లవాడు పిలిచినా వస్తానన్న రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని, ఇక్కడ ఇంత మంది మరణిస్తుంటే ఎందుకు పలకడం లేదని నిలదీశారు. మూసీలోని మూటలు కావాలని కానీ, ప్రజల బాధలు పట్టవా? కాంగ్రెస్ అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తుందా? ఇక్కడి నాయకులు తప్పుచేస్తే పట్టించుకోరా? అని కేటీఆర్ నిలదీశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని విమర్శించారు. డీపీఆరే కాదు.. ప్రాజెక్టు కూడా లేనప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

మూసీ విషయంలో బీజేపీ మౌనమేల? 

మూసీ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రం, బీజేపీ పెద్దల ఒత్తిడితోనే ఆర్డినెన్స్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారని ఆరోపించారు. హైడ్రాపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

పేదల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీని ఏ విధంగా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తానని, అయితే మూసీ నదికి ఇరువైపు బంగారు తాపడం చేపిస్తే తప్ప లక్షన్న కోట్లు ఖర్చు కాదని కేటీఆర్ అన్నారు. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్‌కు లాభమే తప్ప.. సామన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలిపారు. లక్ష మందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

హైడ్రా, ఆర్‌ఆర్ ట్యాక్స్ కారణంగా సిటీలోని 35 లక్షల మంది కార్మికులకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే రేవంత్‌రెడ్డి వణికిపోతున్నారని, అందుకే కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడించారని ఎద్దేవా చేశారు.

నమామి గంగే ప్రాజెక్టులో కిలోమీటరకు రూ.17 కోట్లు ఖర్చయితే.. మూసీకి మాత్రం కిలోమీటరకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారట అని దుయ్యబట్టారు. వర్షాకాలం పూర్తయినా రైతుబంధు ఇవ్వలేదని, తులం బంగారం, రెటింపు పెన్షన్లు ఎప్పడిస్తారని ఆయన ప్రశ్నించారు. 

మాపై సోషల్ మీడియాలో దాడి చేయలేదా? 

తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌తో పాటు తనపై కాంగ్రెస్ నేతలు దాడి చేయలేదా? ఎంతో దారుణంగా మాట్లాడలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే థర్డ్ రేట్ మాటలకు ఇద్దరు మంత్రులు వెళ్లి ఫినాయిల్‌తో నోటిని కడగాలని సూచించారు.

మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ మూర్ఖపు చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ హామీ ఇచ్చారు. మూసీ, హైడ్రా బాధితులు బుధవారం తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిశారు. వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

నిరూపించు.. మూసీలో దూకుతా

  1. నిరూపించకపోతే నువ్వు దూకుతావా? 
  2. హైడ్రాతో రాహుల్‌కు ఏం సంబంధం..
  3. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి 
  4. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఆగ్రహం 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి) : హైడ్రా పేరుతో ఒక్క రూపాయి వసూ లు చేశామని నిరూపించినా తాను పురానాఫూల్ బ్రిడ్జి పైనుంచి మూసీలోకి దూకుతానని.. నిరూపించకపోతే నువ్వు అదే బ్రిడ్జి నుంచి దూకుతావా? అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలోనే బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వ స్థలాలతోపాటు దాదాపు 8౦౦ చెరువులను ఆక్రమించుకున్నారని.. అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై స్పందించాల్సిన కేసీఆర్ ఎక్కడ దాక్కున్నాడో? కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

గాంధీభవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి బుధవారం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పదేళ్ల కాలంలో చెట్లు, లిక్కర్, ఇరిగేషన్ పేరుతో బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేయడం వల్లే హైడ్రా అంటే భయపడుతున్నారని విమర్శించారు.

హైడ్రాకు, మూసీకి సంబంధం లేదని, మూసీ ప్రక్షాళలనకు రూ.వందల కోట్లు చాలని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఏమి సంబంధమని, ఈ విషయంలో కేటీఆర్ ఏమి చదువుకున్నారో ఆర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణకు చాలా సమయం పడుతుందని, అయితే మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇంటిని కూడా ఇప్పటివరకు తొలగంచలేదని స్పష్టంచేశారు.

బాధితులకు ప్రభుత్వం చట్టప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాను నడిపిస్తూ ప్రభుత్వంపై దుష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీలో ఇళ్లను కూల్చితే పేదల పక్షాన పోరాటం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీగౌడ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రశ్నించగా మధుయాష్కీ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదని, పేదలకు అన్యాయం జరగనీయమని చెప్పారని అన్నారు.

ప్రభుత్వం కూడా అదే విషయం చెప్తోందని స్పష్టంచేశారు. బీసీ కులగణన, హైడ్రా ఇతర అంశాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. మంత్రి కొండా సురేఖపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈ విషయంలో బావకు ఉన్న సోయి బామ్మర్దికి లేదని హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. హరీశ్‌రావుకు సామాజిక సృహ ఉందని, కేటీఆర్ లేదని ఎద్దేవాచేశారు.