28-03-2025 01:13:51 AM
కూలిన భవనం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
ఒకరిని బయటకు తీసిన రెస్క్యూ బృందం
ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
మరొకరి కోసం శిథిలాల తొలగింపు
భద్రాచలం, మార్చి 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోకలవారి వీధిలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవని బుధవారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భద్రాచలంలో హైటెన్షన్ నెలకొంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారు జామున 2 గంటలకు జగదీష్ కాలనీకి చెందిన చల్లా కామేశ్వరరావును అతి కష్టంమీద బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న జగదీష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
మరో వ్యక్తి లంబాడీ కాలనీకి చెందిన వడిశాల ఉపేందర్ శిథిలాల కింద ఉన్నట్టు గుర్తించారు. అతడి కోసం శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ విక్రమ్‌కుమార్‌సింగ్ ఘటన స్థలం లో ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నా రు. సహాయక చర్యల్లో విజయవాడకు చెంది న ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలు, ఇతర సహాయక బృందాలు పాల్గొంటున్నాయి. శిథిలా ల కింద ఎంతమంది ఉన్నారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. ఘటన స్థలం వద్ద ఉన్న ద్విచక్ర వాహనాల ఆధారంగా ఇద్దరు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది.
బాధిత కుటుంబాల ఆందోళన
బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు భవనం కూలిపోతే సహాయ చర్యలు మాత్రం తీవ్ర జాప్యంతో సాయత్రం 6 గంటల తర్వాతనే ప్రారంభించారని, ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమంటూ బాధితు కుటుంబీకులు, బంధువులు గురువారం భద్రాచలం బిడ్జ్రిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శిథిలా కింద చిక్కుకున్నాడని భావిస్తున్న లంబాడీ కాలనీకి చెందిన వరిశల ఉపేందర్ కుటుంబ ఆందోళన చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా పోలీసులకు, ఆందోళన కారులకు వాగ్వాదం, తోపులాట జరిగింది.
పోలీసుల అదుపులో ఇంటి యజమాని?
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టిన భవన యజమాని మౌలనా అలియాస్ శ్రీపాద శ్రీపతి ఘటన జరిగిన వెంటనే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఒక గంట తర్వాత అతడి భార్య కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా 30 సంవత్సరా ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.