calender_icon.png 16 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చంపేటలో హై టెన్షన్..!

15-01-2025 10:23:59 PM

భ్రమరాంబిక ఆలయం వద్ద హైడ్రామా..

మాజీ ఎమ్మెల్యే గువ్వల పోలీసుల మధ్య రసాభస..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భ్రమరాంబిక ఆలయంలోకి ప్రవేశించేందుకు తనను అనుమతించలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారి సతీమణి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసుల వద్ద వాదనకు దిగారు. ఉమామహేశ్వర ఆలయంలో జరిగే జాతరకు ముందు అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వద్ద నుండి చీరే సారే గంధంతో ప్రభ ఉత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సైతం ఆలయ నిర్వాహకులు ఆహ్వానాన్ని పంపారు. కానీ మొదటగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వారు పూజలు నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు మొదట పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అదే సమయంలో గువ్వల బాలరాజు సైతం ఎంట్రీ కావడంతో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కొద్దిసేపు నిలువరించారు.

దీంతో తనను ఆలయంలోకి వెళ్లకుండా పోలీసుల చేత అడ్డుకున్నారని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొద్దిసేపు హై డ్రామా అనంతరం మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వామి మాలలో ఉండి కూడా గుడి వద్ద రాజకీయం చేస్తున్నాడంటూ గువ్వల వాదించగా తన అహంకారం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఓటమి పాలైనప్పటికీ తానే ఎమ్మెల్యేగా ఊహించుకుంటూ గువ్వల బాలరాజు హంగామా చేస్తూ అచ్చంపేటలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నాడంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.