calender_icon.png 17 January, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద హైటెన్షన్

17-01-2025 12:51:06 AM

* ఎన్‌ఎస్‌యూఐ హెచ్చరికతో మోహరించిన పోలీసులు

* ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాల వద్ద హైటెన్షన్ నెలకొంది. ‘అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు గురువారం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తుగా బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. అటు గాంధీభవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరవుతున్నందున కాంగ్రెస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికలతో పోలీసులు మోహరించారు. ఈడీ విచారణ పూర్తయ్యే వరకు భద్రతను పటిష్టం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు 

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బషీర్‌భాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తుగా బలగాలను మోహరించారు. అక్కడ బాష్ఫవాయువు, వాటర్‌కెనాన్ల వాహనాలను ఉంచారు.

కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మన్నె క్రిశాంక్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.