calender_icon.png 22 October, 2024 | 9:50 AM

కఠోర శ్రమతోనే ఉన్నత స్థాయి

21-10-2024 12:04:46 AM

* ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్‌శెట్టి 

వనపర్తి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): కఠోర శ్రమ ఉంటేనే ఉన్నత స్థాయికి వెళ్లగలమని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాస్‌శెట్టి అన్నారు. ఎస్బీఐ చైర్మన్‌గా ఆదివారం తన సొంత జిల్లా వనపర్తికి వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డు గణేష్ ఆలయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్లు ఆదర్శ్ సురభి, బదావత్ సంతోష్, సంతోష్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సంవత్సరంలో దేశంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు, 1,000 పీహెచ్‌సీలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో ఎస్బీఐలో 55 శాతం బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని, 45 శాతం మార్కెట్ షేర్ ఉన్నదన్నారు.

అనంతరం పీఎం విశ్వకర్మ యోజన కింద జిల్లాలో 185 మంది లబ్ధిదారులకు రూ1.47 కోట్ల విలువైన చెక్కులు, రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ముద్ర రుణ పథకం కింద 50 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ.31.96 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.