- ఉదయం సీఆర్పీఎఫ్ బలగాల తొలగింపు
- సాయంత్రం 4 గంటల తర్వాత మళ్లీ వెనక్కి
- కేంద్ర ఆదేశాలే కారణమని సమాచారం
నల్లగొండ, డిసెంబర్ 28 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ భద్రత పర్యవేక్షణపై శనివారం హైడ్రామా నడించింది. డ్యామ్ భద్రతను పర్యవేక్షించే సీఆర్పీఎఫ్ బలగాలను ఉదయం 7 గంటల తర్వాత తొల గించారు. దీంతో డ్యామ్ పూర్తిగా ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లింది.
సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఏకంగా ఇరు రాష్ట్రాల పోలీసుల నడుమ ఈ విషయం ఘర్షణకు దారి తీసింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఇరు రాష్ట్రాల అంగీకారం మేర కు డ్యామ్ పర్యవేక్షణను కృష్ణాబోర్డు, సీఆర్పీఎఫ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నాటి నుంచి సాగర్ ప్రాజెక్టు భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలు చూస్తున్నాయి.
నాడు ఏడాది కాలానికి మాత్రమే సీఆర్పీఎఫ్‌కు అనుమతివ్వగా.. శనివారంతో ఈ గడువు ముగిసినట్టు సమాచారం. అయితే మళ్లీ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్ విభాగానికే అప్పగిస్తూ కేంద్రం, కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకోవడంతో సాయంత్రానికి బలగాలు మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిసింది.