calender_icon.png 27 November, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక సాంద్రత పత్తి సాగుతో పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ..

27-11-2024 06:25:40 PM

కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. కోట శివకృష్ణ

మందమర్రి (విజయక్రాంతి): అధిక సాంద్రత ప్రతి సాగులో పెట్టుబడి తక్కువగా ఉండి దిగుబడి అధికంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఈ సాగుపై అవగాహన పెంపొందించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని పొన్నారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, జాతీయ ప్రత్తి పరిశోధన సంస్థ నాగపూర్ సంయుక్తంగా పొన్నారం గ్రామంలో అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగుచేస్తున్న రైతు క్షేత్రాన్ని పర్యటించి రైతు అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మండలం పరిధిలో అధిక సాంద్రత ప్రత్తి సాగు/దగ్గరి వరుసల్లో పత్తి సాగు పద్ధతిపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

జాతీయ ప్రత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) నాగపూర్ సంయుక్తంగా జాతీయ ఆహార భద్రత మిషన్ క్రింద ఉత్తమ పద్ధతుల ద్వారా ప్రత్తి ఉత్పాదకతను పెంచేలా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల రైతు క్షేత్రాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా మండల పరిధిలోని పోన్నారం గ్రామంలో రైతు సాగు చేసిన పత్తి క్షేత్రాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం శాస్త్రవేత్త డా. తిరుపతి మాట్లాడుతూ.. అధిక సాంద్రత ప్రత్తి సాగు ప్రాముఖ్యత గురించి, నేలల  రకాలు, విత్తన ఎంపిక, సమగ్ర కలుపు, పోషక, చీడపీడల యాజమాన్యంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిపించారు. అంతేగాక అధిక సాంద్రత ప్రత్తిసాగు చేపట్టిన రైతు అనుభవాలను, సాగులో తలెత్తిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద సీడ్స్ కంపనీ సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ అశోక్ మాట్లాడుతూ.. ప్లాటినం పత్తి తీయడంలో చాలా సులువుగా ఉంటుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చని తద్వారా రైతులు అధిక లాభాలు పొందుతారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి శాస్త్రవేత్తలు డా. తిరుపతి, వేద సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ అశోక్, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి యంగ్ ప్రొఫెషనల్స్ డా. ప్రియాంక, శైలజ, అనిల్ తో పాటు గ్రామ రైతు ముప్పిడి లచ్చన్నలు పాల్గొన్నారు.