19-04-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రూప్--1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు విజయం విద్యార్థులు, వారికి అండగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.
గ్రూప్-1 ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బీఆర్‌ఎస్ మొదటి నుంచి పోరాటం చేసిందని, తాము ప్రశ్నించినందుకు తనపై పరువునష్టం దావా వేస్తామని టీజీపీఎస్సీ లేఖ పంపిందని తెలిపారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్యకు, ఫలితాల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు.
టీజీపీఎస్సీలో ఏదైనా సైబర్ నేరం జరిగిందా? అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కేసులు వేస్తున్న అభ్యర్థులను కోర్టు ముందే బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.