21-02-2025 02:41:39 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. పిటిషన్ లో బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్లను పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే గతంలో మేడిగడ్డ ఘటనపై రాజలింగమూర్తి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టుకు విచారనార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారన్న పిటిషనర్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు.
హైకోర్టులో విచారణ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ తరపు న్యాయవాది ఫిర్యాదుదారు చనిపోయారని తెలిపారు. రాజలింగమూర్తి మృతి చెందాడన్న విషయం మీడియా ద్వారా తెలిసిందని, భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే విచారణ ఎలా చేపడతామని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించొచ్చన్ని, ఈ మేరకు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పులు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. వాదనలు వినిపించడానికి గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.