హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఆలయాల్లోని అర్చకుల బదిలీ ప్రక్రియను నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని ఆలయాల్లోని అర్చకుల బదిలీ ఆప్షన్లను కోరుతూ దేవాదాయశాఖ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కే శ్రీమన్నారాయణా చార్యులు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం మతపరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, ఆలయ నిర్వహణ, పరిపాలనను మాత్రమే పర్యవేక్షించాలని అన్నారు. అర్చకులను ఉద్యోగిగా పరిగణి స్తూ బదిలీకి ప్రయత్నాలు చేయడం చెల్లదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి బదిలీ ప్రక్రియపై స్టే విధిస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.