కరీంనగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాం తి): జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై హైకోర్టు స్టే విధించింది. కరీంనగర్ నగర పరిధిలో పనిచేస్తున్న 149 మంది జర్నలిస్టులకు ఏడాది క్రితం అప్పటి మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చింతకుంట సమీపంలో బీపీఎల్ కోటా కింద ఇండ్ల స్థలాలను కేటాయించారు. అందులో స్థానికేతరులకు, అర్హత లేనివారికి కేటాయించారంటూ కొందరు పాత్రికేయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు స్టే విధిస్తూ నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కొక్కరికి 180 గజాల చొప్పున 149 మందికి కేటాయించారు. అందులో 50 మంది అనర్హులకు స్థలం కేటాయించారని కొందరు ఆధారాలతో సహా హైకోర్టుకు సమర్పించారు. కేటాయించిన స్థలం ఎస్సారెస్పీ స్థలం కావడంతో ఎన్‌వోసీ తప్పనిసరి. ఎన్‌వోసీ రాకముందే కేటాయింపు జరగడం ఈ ప్రభుత్వంలో ఎన్‌వోసీకి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో హైకోర్టు స్టే విధించింది.